ఆహ్వానం..40 ఏళ్ల అనుబంధం!

30 Aug, 2018 03:24 IST|Sakshi

హరికృష్ణకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన హోటల్‌ 

రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే 

ఆయన మరణవార్తతో ఎన్టీఆర్‌ ఎస్టేట్‌లో విషాదఛాయలు 

రామకృష్ణ థియేటర్‌తోపాటు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేత 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్‌తో నందమూరి హరికృష్ణకు విడదీయరాని బంధం ఉంది. గత నలభై ఏళ్లుగా ఆయనకు ఈ హోటల్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ఎన్టీఆర్, హరికృష్ణ అభిమానులు అక్కడకు తరలివచ్చేవారు.. వారిని హరికృష్ణ ఆత్మీయంగా పలకరించేవారు. యోగక్షేమాలను తెలుసుకుని.. వచ్చిన వారికి భోజనం పెట్టి ఆదరించి అక్కున చేర్చుకునేవారు. బుధవారం ఆయన అకాల మరణవార్త తెలిసి ఎన్టీఆర్‌ ఎస్టేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణ థియేటర్‌తోపాటు దుకాణ సముదాయాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి హరికృష్ణ నివాసానికి తరలివెళ్లారు. ఆహ్వానం హోటల్‌ సిబ్బంది హరికృష్ణ చిత్రపటాన్ని ప్రవేశద్వారం వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. 

1001 నంబరు గది.. : మూడంతస్తులున్న ఆహ్వానం హోటల్‌లో మొత్తం 48 గదులున్నాయి. వీటిలో మూడు మినహా మిగతా 45 గదులను హోటల్‌ సిబ్బంది అద్దెకిస్తున్నారు. ఈ మూడు గదులను హరికృష్ణ తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించేవారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు మాత్రమే ఈ గదులను కేటాయించేవారు. రోజూ ఉదయం 11 గంటలకు హోటల్‌కు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు 1001 నంబరు గదిలో ఉండేవారు. పదేళ్లుగా హోటల్‌ నిర్వహణ బాధ్యతలను కృష్ణారావు అనే వ్యక్తికి హరికృష్ణ అప్పజెప్పారు. అంతకుముందు తానే హోటల్‌ బాధ్యతలు చూసేవారని సిబ్బంది తెలిపారు.
 
‘టాటా సియారా’పై ఎనలేని ప్రేమ: ఆహ్వానం హోటల్‌ ఎదురుగా పార్క్‌ చేసిన తెలుపు రంగు టాటా సియారా వాహనం అంటే హరికృష్ణకు ఎంతో ప్రేమ. ఈ వాహనం నంబర్‌ ఏపీ 20బి 3339ని లక్కీ నంబర్‌గా భావించేవారని హోటల్‌ సిబ్బంది తెలిపారు. హోటల్‌ ఆవరణలో పార్క్‌ చేసిన ఏఏయూ 2622 నంబరు బుల్లెట్, ఏపీ 9ఏ 5229 బుల్లెట్‌లంటే ఆయనకు ఎంతో మక్కువ. ఇక్కడే పార్క్‌ చేసిన బజాజ్‌ చేతక్, హీరో హోండా వాహనాలు గతంలో హరికృష్ణ వాడినవే. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను నడపడం, వాటిపై సుదూర ప్రాంతాలకు నడుపుకుంటూ వెళ్లడం అంటే ఆయనకు ఎనలేని సరదా అని స్థానికులు తెలిపారు. 

మరిన్ని వార్తలు