ఆరోగ్యశ్రీ అవస్థ

17 Aug, 2019 12:55 IST|Sakshi

సేవలు నిలిపివేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు  

ఓపీ, ఐపీ సహా డయాలసిస్‌ సైతం  

అస్వస్థతకు గురైన కిడ్నీ బాధితులు  

ఫీవర్‌ సహా నిమ్స్‌కు పోటెత్తిన రోగులు  

ఉస్మానియా, గాంధీల్లో పెరిగిన ఎమర్జెన్సీ కేసులు  

ప్రభుత్వంతో ప్రతినిధుల చర్చలు విఫలం  

నేడూ సేవలు బంద్‌   

ఈమె పేరు శాంతమ్మ. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌. ప్రమాదవశాత్తు కిందపడడంతో చేయి విరిగింది. శుక్రవారం చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికివచ్చింది. అయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించడంతో.. వాళ్లు అడిగినంత చెల్లించి వైద్యం చేయించుకుంది.  

.....ఇలా ఒక్క శాంతమ్మనే కాదు. వివిధ ప్రమాదాల్లో గాయపడి చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చేరుకున్న క్షతగాత్రులు, హృద్రోగ, కిడ్నీ బాధితులు విధిలేని పరిస్థితుల్లో డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది.  

సాక్షి, సిటీబ్యూరో:  ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కొంతకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న విషయం విదితమే. ఈ నెల 15లోగా 70శాతం బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో అదే రోజు అర్ధరాత్రి నుంచి ఓపీ, ఐపీ సహా అత్యవసర సేవలన్నీ నిలిపి వేయనున్నట్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల హెచ్చరికలను ప్రభుత్వం లెక్క చేయకపోవడంతో ఆయా ఆస్పత్రులు గురువారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. దీంతో పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య సేవలు పొందవచ్చని అనేక మంది ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకొని శుక్రవారం ఉదయం నగరంలోని ఆయా ఆస్పత్రులకు చేరుకోగా నిరాశే ఎదురైంది. కొంతమంది ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ ఆస్పత్రులకు వెళ్లగా... మరికొంత మంది విధిలేని పరిస్థితుల్లో వాళ్లు అడిగినంత చెల్లించి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరిపోయారు. ఓపీ, ఐపీ సహా డయాలసిస్‌ సేవలు కూడా నిలిపివేడంతో ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కోసం ఎదురుచూస్తున్న కిడ్నీ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

చర్చలు విఫలం..  
ఆరోగ్యశ్రీ పథకం కింద గ్రేటర్‌లో 120కి పైగా ఆస్పత్రులు ఉన్నాయి. దీని కింద 940 రకాల జబ్బులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. రోజుకు సగటున 10వేల మందికి ఓపీ సేవలు అందిస్తుండగా, మరో 3వేల మంది ఇన్‌పేషెంట్లుగా అడ్మిషన్‌ పొందుతుంటారు. ప్రభుత్వం రోగుల చికిత్సలకు అయిన ఖర్చులను ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.1500 కోట్లకు చేరుకున్నాయి. బకాయిలు చెల్లించాలని ఆయా ఆస్పత్రులు గతేడాది నవంబర్‌లోనే ఆందోళనకు దిగాయి. అప్పట్లో రూ.132 కోట్లు చెల్లించి, మిగిలినవి త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సేవలు కొనసాగించాయి. అయితే ఆ మేరకు చెల్లింపులు చేయకపోవడంతో మళ్లీ ఆందోళన బాటపట్టాయి. ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో చేరిన రోగులకు వైద్యం అందిస్తున్నప్పటికీ.. శుక్రవారం నుంచి ఓపీ, ఐపీ, అత్యవసర కేసుల అడ్మిషన్లు పూర్తిగా నిలిపివేశాయి. మధ్యాహ్నం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు విఫలమవడంతో ఆయా ఆస్పత్రుల్లో శనివారం కూడా సేవలు నిలిచిపోనున్నాయి.  

ఫీవర్‌కు పరుగులు 
ఫీవర్‌ ఆస్పత్రికి జ్వరపీడితులు పోటెత్తారు. శుక్రవారం అత్యధికంగా 1,964 మంది రోగులు వచ్చారు. వీరిలో 76 మంది ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రోజువారీ సగటు ఓపీ 900–1,200 మాత్రమే కాగా, తాజాగా ఈ సంఖ్య మరింత పెరగడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓపీలో రోగుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేకపోవడంతో గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సి వచ్చింది. బాధితుల్లో జ్వరం, ఒళ్లు, గొంతు నొప్పులతో బాధపడుతున్న వారే అధికం. ఇక నిమ్స్‌ ఓపీకి రోజుకు సగటున 1,500 మంది వస్తుంటారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో తాజాగా శుక్రవారం 1,983 మంది వచ్చారు. వీరిలో ఆరోగ్యశ్రీ బాధితులే ఎక్కవ. అత్యవసర విభాగానికి రోజుకు సగటున 100–120 కేసులు వస్తే... తాజాగా 160 కేసులు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన బాధితుల్లో 90 శాతం మంది ఆరోగ్యశ్రీలబ్ధిదారులే. ఇక ఉస్మానియా, గాంధీ అత్యవసర విభాగాలకు కూడా ఎమర్జెన్సీ కేసులు 20–30 శాతం పెరిగినట్లు ఆయా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

ఏం చేయాలి?  
మాది వరంగల్‌ జిల్లా నెల్లికుదురు. ఆరోగ్యశ్రీ పథకం కింద గత గరువారం కిమ్స్‌లో కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకున్నాను. శుక్రవారం రివ్యూకు రావాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆస్పత్రికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూడటం లేదని చెప్పారు. మరో వారం రోజుల తర్వాత రావాలన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.      – నిమ్మ, వరంగల్‌  

మా పరిస్థితేంటి?  
ఆస్పత్రులు ఉన్నట్టుండి వైద్య సేవలు నిలిపివేస్తే మాలాంటి మధ్య తరగతి వారి పరిస్థితేంటి? సర్జరీ కోసం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వస్తే చేయలేమని పంపించేశారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయలేమంటూ నిరాకరిస్తున్నారు. ఆపదలో ఉన్న సమయంలో ఇలా చేయడం బాధాకరం.      – ఖదీర్, వరంగల్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా