‘ఆరోగ్యశ్రీ’ బంద్‌ విరమణ 

3 Dec, 2018 03:57 IST|Sakshi

ట్రస్ట్‌ సీఈవో మాణిక్‌రాజ్‌తో చర్చలు సఫలం

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆందోళనను విరమించాయి. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో మాణిక్‌రాజ్‌తో ఆదివారం జరిగిన చర్చలు సఫలం కావడంతో వైద్య సేవల బంద్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం ప్రకటించిం ది. తక్షణమే వైద్య సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్‌ ‘సాక్షి’కి తెలిపారు. సీఈవో తమ సమస్యలకు సానుకూలంగా స్పందించారని, ఈ నెలాఖరుకు మరో రూ.150 కోట్లు్ల ఇచ్చేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే రూ.150 కోట్లు చెల్లించినందుకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. 

బకాయిలు పేరుకుపోవడంతో... 
ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాల కింద పేదలు, ఉద్యోగులకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయి లు పేరుకుపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. రూ.1200 కోట్ల  బకాయిలు ఉండటంతో ఆ రెండు పథకాల కింద లబ్ధిదారులకు వైద్య సేవలను గత నెల 20వ తేదీ నుంచి నిలిపేశాయి. ప్రభుత్వం రూ.150 కోట్ల వరకు విడుదల చేసింది. పూర్తిస్థాయి తీర్చలేదంటూ ఈ నెల 1 నుంచి పూర్తిస్థాయిలో ఇన్‌పేషెంట్, అత్యవసర వైద్య సేవలనూ నిలిపివేశాయి. 

ఆందోళనలపై సర్కారు ఆగ్రహం 
ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే, మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయటంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయం సందర్భం లేకుండా సేవలను నిలిపివేయడంలో రాజకీయ స్వార్థం దాగుందని సర్కారు వర్గాలు అనుమానించాయి. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన పలువురు అధికారులు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల తీరును ఖండించారు. చివరకు మంత్రి రంగంలోకి దిగి సీరియస్‌ కావడంతో చర్చలు జరగడం, బంద్‌ ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయింది. అత్యవసర వైద్య సేవలను నిలిపేస్తున్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుండటంతో వాటి యాజమాన్యాల్లోనూ భయాందోళనలు ఏర్పడ్డాయి. చివరకు సంబంధిత ఆస్పత్రుల్లో కొన్నింటికి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు జరిగాయి. ఈ పరిస్థితిని గమనించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వెనక్కు తగ్గాయన్న ప్రచారం జరుగుతోంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా