ఆరోగ్య’సిరి’ పెంపుపై సర్కారు దృష్టి 

11 May, 2019 02:13 IST|Sakshi

తక్కువ ధరలు ఉన్నాయంటున్న కార్పొరేట్‌ ఆసుపత్రులు 

వీటిపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ అందించే వైద్యసేవలు, శస్త్రచికిత్సల ప్యాకేజీ ధరలను పెంచే యోచనలో సర్కారు ఉంది. వీటిని సమీక్షించి ప్రస్తుత ధరల మేరకు సవరించాలని భావిస్తోంది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడో నిర్ణయించిన ధరల వల్ల కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు అసంతృప్తిలో ఉన్నాయన్నది సర్కారు భావన. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు పొందే పేదలపట్ల ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు చిన్నచూపు చూస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొన్ని రకాల శస్త్రచికిత్సలను చేయకుండా వెనక్కు తిప్పి పంపుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకవేళ శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే నాసిరకంగా సేవలు అందిస్తున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వం వద్దకు చేరుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ రోగులను నాసిరకం వార్డుల్లో ఉంచుతున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ స్ఫూర్తి దెబ్బతింటుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవాలకు దగ్గరగా ఉండేలా ప్యాకేజీలను సిద్ధం చేసి సక్రమంగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు సరైన వైద్య అందజేయాలని సర్కారు భావిస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.  

మరిన్ని వార్తలు