కొనసాగుతున్న ‘ఆరోగ్యశ్రీ’ బంద్‌

19 Aug, 2019 02:01 IST|Sakshi

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందక పేదల అవస్థలు

గాంధీ, నిమ్స్‌కు పెరుగుతున్న తాకిడి

నేడు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ భేటీ

ప్రభుత్వ తీరు, తాజా పరిస్థితులపై చర్చించి కార్యాచరణ  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సేవలు నిలిచిపోవడంతో ఖరీదైన చికిత్సలను ఉచితంగా పొందేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. వరుసగా మూడోరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోగా గ్రామీణ ప్రాంత రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చి వెనుదిరుగుతున్నారు. డయాలసిస్‌ మొదలుకొని గుండెకు సంబం ధించిన చికిత్సల కోసం నిత్యం వేల మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుంటారు. వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందుతుంటాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవటంతో ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలను నిలిపేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 240 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. బకాయిలను విడుదల చేస్తే తప్ప సేవలను అందించేది లేదని ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఉన్నఫళంగా పేద రోగులు నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు వెళ్తుండటంతో ఆయా ఆసుపత్రుల్లో రద్దీ ఏర్పడుతోంది. 

భవిష్యత్తు కార్యాచరణ...
బకాయిల విషయంలో ప్రభుత్వం, నెట్‌వర్క్‌ ఆసుపత్రులు చెబుతున్న లెక్కకు పొంతన కుదరక చర్చలు ముందుకు సాగడం లేదు. సమస్య పరిష్కారానికి ఈ మూడు రోజుల్లో ఒక్కడ అడుగు కూడా ముందుకు పడలేదు. బకాయిల వివరాలను ప్రభుత్వం పూర్తిగా అందించలేదని నెట్‌వర్క్‌ హాస్పి టల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. రెండ్రోజుల్లో మరోసారి చర్చలకు పిలుస్తామని చెప్పిన ప్రభుత్వం... ఇప్పుడు రెండు నెలల దాకా డబ్బు ఇవ్వలేమని చెబుతోందని అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సోమవారం తమ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తా మని అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు