నేటి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్‌ 

1 Dec, 2018 01:52 IST|Sakshi

అత్యవసర ఐపీసేవల నిలిపివేతకు ప్రైవేట్‌ ఆపత్రుల నిర్ణయం

ఇప్పటికే ఔట్‌ పేషెంట్, వైద్య పరీక్షల బంద్‌తో రోగుల అవస్థలు 

బకాయిల విడుదలలో సర్కారు నిర్లక్ష్యంపై ఆసుపత్రుల ఆందోళన 

ఇంత జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యం..

సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారింది. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల బకాయిలను తీర్చకపోవడంతో పరిస్థితి తీవ్రంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి ఆరోగ్యశ్రీ సహా ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌) కింద వైద్య సేవలన్నింటినీ నిలిపివేయాలని తెలంగాణ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. దీంతో పది రోజులుగా ఔట్‌ పేషెంట్‌ సేవలు, వైద్య పరీక్షలను మాత్రమే నిలిపివేసిన ఆసుపత్రులు ఇక నుంచి ఇన్‌పేషెంట్‌ సహా అన్ని రకాల అత్యవసర సేవలనూ బంద్‌ చేయనున్నాయి.

ఆరోగ్యశ్రీ పరిధిలోని పేదలు, ఈజేహెచ్‌ఎస్‌లోని బాధితులంతా ఇబ్బందులు పడనున్నారు. బకాయిలు తీర్చకుంటే సేవలు నిలిపివేస్తామని 20 రోజుల క్రితమే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం వైద్య ఆరోగ్యశాఖకు, ఆరోగ్యశ్రీకి నోటీసులిచ్చింది. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తమకేమీ పట్టనట్లు ఉన్నారు. మరీ విచిత్రమేమిటంటే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్‌రాజ్‌ సహా ఉన్నతాధికారులంతా మహారాష్ట్రలో 3 రోజుల పర్యటనకు వెళ్లారు. అంతేకాదు కేవలం ఒక్క నవంబర్‌ నెలలోనే ఏకంగా మూడుసార్లు 3 రాష్ట్రాలకు వివిధ పర్యటనలంటూ వెళ్లొచ్చారు. అవేమన్నా అత్యవసర, కీలకమైన పర్యటనలా అంటే అదీ కాదు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలకమైన సమయంలో అందుబాటులో ఉండాల్సిన వైద్య యంత్రాంగమంతా ఇలా టూర్లకు వెళ్తుండటం వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ అవుతుంటే, అధికారులు టూర్ల పేరుతో ఇతర ప్రాంతాల్లో ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

అత్యవసర సేవలు నిలిచిపోతే ఎలా? 
రాష్ట్రంలో 236 ప్రైవేటు నెట్‌వర్క్, 96 ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటికితోడు మరో 67 డెంటల్‌ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ ఆస్పత్రులున్నాయి. ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం డెంటల్‌ వైద్య సేవలు అందవు. కేవలం ఈజేహెచ్‌ఎస్‌ రోగులకే డెంటల్‌ సేవలు అందజేస్తారు. అంటే రాష్ట్రంలో డెంటల్‌తో కలిపి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ 303 ఆస్పత్రులున్నాయి. సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో శనివారం నుంచి అన్ని రకాల వైద్య సేవలూ నిలిపివేస్తున్నట్లు సంఘం పేర్కొంది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రతీ రోజూ సరాసరి 10 వేల మంది ఓపీ, 3 వేల మంది ఇన్‌ పేషెంట్లు వస్తుంటారు. ఒక అంచనా ప్రకారం ఇన్‌పేషెంట్లుగా వచ్చే వారిలో ప్రతీ రోజు వెయ్యి మందికి వివిధ రకాల ఆపరేషన్లు జరుగుతాయి. ఆపరేషన్లను కూడా ఆపడం పేదలు, ఉద్యోగుల పాలిట శాపంగా మారనుంది.  

డబ్బులు లేకుంటే ఆపేయండి..
డాక్టర్‌ రాకేష్, అధ్యక్షుడు, తెలంగాణ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వం 12 నెలలుగా డబ్బులు విడుదల చేయడంలేదు. దీంతో రూ. 1,200 కోట్లు ప్రైవేట్‌ ఆసుపత్రులకు బకాయి పడింది. రెండ్రోజుల క్రితం కేవలం రూ.150 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు కానీ ఎవరికి డబ్బులు వేశారో కూడా తెలియదు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాలను ఎందుకు నడపాలన్నదే మా ప్రశ్న. డబ్బులు ఇస్తామంటూ ఇవ్వకుండా ఆసుపత్రులను బజారున పడేస్తున్నారు. 

బకాయిలు రూ.350 కోట్లే
వైద్య ఆరోగ్యశాఖ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం నెట్‌వర్క్‌ ఆసుపత్రులు చెబుతున్నట్లుగా రూ.1,200 కోట్ల బకాయి లేదనీ, కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఉన్నాయంటున్నారు. రెండ్రోజుల క్రితం రూ.150 కోట్లు విడుదల చేశామని, కాబట్టి ఇంకా రూ.200 కోట్లు మాత్రమే బకాయి ఉందని అంటున్నారు. రాజకీయపరమైన కారణాలతోనే నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఇలా వైద్య సేవలను నిలిపివేస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు