పండుటాకులకు ఆసరా

26 Mar, 2019 13:07 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం పండుటాకులకు ఆసరాగా, దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా ఆసరా పింఛన్లను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. గతంలో రూ.75 ఉన్న పింఛనును దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.200లకు పెంచారు. దాంతో అప్పటి ధరల మేరకు వారికి ఆసరాగా నిలిచిన పింఛన్లను 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో గెలిస్తే వాటిని పెంచుతామని ప్రకటించింది.

గెలిచిన తరువాత వృద్ధులకు, వితంతువులకు రూ.200 నుంచి రూ.1000, వికలాంగులకు రూ.500 నుంచి రూ.1500 పెంచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంచటంతో పాటు, పింఛను వయస్సను కుదిస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

పింఛను అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించనున్నట్లు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హామీ అమలు దిశగా రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, అర్హులైన వారి వివరాలను ప్రభుత్వ యంత్రాంగం సేకరిస్తుంది. ఏప్రిల్‌ నుంచి పెంచిన ఫించన్లు అందజేసేలా సమాయత్తం అవుతుంది.

మరింత మందికి లబ్ధి..
తాజా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 57 నుంచి 64 ఏళ్ల మధ్య ఎంతమంది ఉన్నారు అనే వివరాలతో కూడిన జాబితా  అధికారులు సిద్ధంచేశారు. ఆ జాబితాలోని వారు మరే ఇతర రకాల పింఛన్లు ఏమైనా తీసుకుంటున్నారా అని పరిశీలిస్తున్నారు. 57–64 ఏళ్ల మధ్య ఉన్నవారు వికలాంగులైతే వికలాంగుల పింఛను తీసుకొనే అవకాశం ఉంటుంది.

ఇలాంటి వారు మళ్లీ ఆసరా పింఛను తీసుకోవడానికి అనర్హులు. ఇలా క్షేత్రపరిశీలన చేసి నిజమైన అర్హులను గుర్తిస్తున్నారు. దీని ప్రకారం వృద్ధాప్య పెన్షన్ల నిబంధనలు పరిశీలిస్తే 1953 నుంచి 1961 మధ్య జన్మించి, 57 ఏళ్లు దాటి ఉండాలి. మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి మూడెకరాలు దాటరాదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు దాటరాదు. దరఖాస్తుదారుల వివరాలను వీఆర్వోలు, బిల్‌ కలెక్టర్లు సేకరిస్తున్నారు. సుమారుగా జిల్లావ్యాప్తంగా మరో 20వేల మందికి అదనంగా లబ్ధి చేకూరనుంది.

జిల్లాల వారీగా పింఛన్ల లబ్ధిదారుల వివరాలు..
మహబూబాబాద్‌ : 1,03,461
జనగాం : 79,228
భూపాలపల్లి : 92,737
వరంగల్‌ రూరల్‌ : 96,364
వరంగల్‌ అర్బన్‌ : 1,13,324

కన్న కొడుకులా ఆదుకుంటుండు..
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముసలి , ఒంటరి, వికలాంగ , ఇతరులకు నెలసరి పింఛన్లు ఇచ్చి ఆదుకున్నాడు. కొత్తగా అప్పుడు ఆ దొర ఐదేళ్లు ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్న కొడుకులా నెలనెలా సొంత బిడ్డలా పింఛను ఇస్తున్నాడు.  ఆ అయ్య చల్లంగా ఉండాలే.
-షేక్‌ యాకూబ్‌ బీ, వృద్ధురాలు.గూడూరు 

అవసరానికి అందుతున్నయి..
వృద్ధాప్యంలో ఆసరా పింఛను ఇచ్చి సీఎం కేసీఆర్‌ పెద్ద కొడుకులా ఆదుకుంటుండు. పింఛన్‌ రూ.1000 నుంచి రూ.రెండు వేలు పెంచడం చాలా ఆనందంగా ఉంది. ముసలోళ్లు ప్రతిఒక్కరూ కేసీఆర్‌నే కోలుస్తుండ్రు. దేశంలో ఎవరూ చేయని విధంగా ఆదుకుంటుండు. ఒకటో తారీకు రాగానే పింఛను డబ్బులు వస్తే ఎవరిపై ఆధారపడకుండా అవసరానికి అందుతున్నాయి.
-కొత్త బుచ్చమ్మ, వృద్ధురాలు, నర్సింహులపేట 

మరిన్ని వార్తలు