‘ఏబీవీ’ బినామీ భూ బాగోతం

14 Feb, 2020 02:03 IST|Sakshi

తెలంగాణలో భారీగా భూములు కొన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌

నారాయణపేట జిల్లాలోని రెండు గ్రామాల్లో 117.14 ఎకరాలు కొనుగోలు

సాక్షి, మహబూబ్‌నగర్: ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు బినామీ బాగోతం బట్టబయలైంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం పసుపుల, చిట్యాల గ్రామాల్లో 117.14 ఎకరాల భూములను 11 మంది బినామీల పేరిట ఆయన కొనుగోలు చేసిన ఉదంతం వెలుగుచూసింది. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన వెంకటేశ్వరరావు ఏడీజీపీగా పనిచేసిన కాలంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలడం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల కింద వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. అయితే వెంకటేశ్వరరావు తన హోదాను అడ్డుపెట్టుకొని భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మక్తల్‌ మండల పరిధిలోని పసుపుల, చిట్యాల గ్రామాల్లో బినామీల పేరిట 117.14 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. భూముల కొనుగోలు సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు తన నమ్మకస్తుల పేరిట పట్టా చేయించారు.

రెండు గ్రామాలు... 117.14 ఎకరాలు 
పదేళ్ల క్రితం నుంచే పసుపుల గ్రామంలో 52.19 ఎకరాలు, చిట్యాలలో 64.35 ఎకరాల చొప్పున మొత్తం 117.14 ఎకరాలను వెంకటేశ్వరరావు బినామీల పేరిట కొనుగోలు చేశారు. ప్రత్యక్షంగా భూ లావాదేవీలు కొనసాగిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఊహించిన ఆయన... ముందు జాగ్రత్తగా భూముల కొనుగోళ్ల విషయంలో మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడిని రంగంలో దింపారు. ఆయన మధ్యవర్తిత్వంతో ఆయా గ్రామాల్లో భూములను కొనుగోలు చేశారు.

కొనుగోలు చేసిన భూముల్లో సాగు చేస్తున్న వెంకటేశ్వరరావు... రైతులతో సాగు చేయిస్తే విషయం బయటకు పొక్కుతుందని భావించి ఆధునిక పద్ధతులను ఎంచుకున్నారు. మందుల పిచికారీ, నూర్పిడి, విత్తనాలు విత్తడం వంటి పనులను యంత్రాల ద్వారా నిర్వహిస్తూ కూలీల అవసరాన్ని తగ్గించి జాగ్రత్తపడినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పొలంలోనే ఫాంహౌస్‌ ఏర్పాటు చేసుకున్న వెంకటేశ్వరరావు... నెలకోసారి కచ్చితంగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి వెళతారని గ్రామస్తులు తెలిపారు.

కృష్ణా నది టు వ్యవసాయ క్షేత్రం..

కృష్ణానది వద్ద మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న దృశ్యం

తన వ్యవసాయ క్షేత్రం నుంచి సుమారు 3 కి.మీ. మేర కృష్ణా నది ఒడ్డున ఉన్న దత్తాత్రేయస్వామి ఎత్తిపోతల పథకం పక్కనే దానికి సమాంతరంగా మరో చిన్నపాటి ఎత్తిపోతలను వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు 10 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేసి కృష్ణా నది భూగర్భం నుంచి పెద్ద పైప్‌లైన్ల ద్వారా నీటిని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తున్నారు. ఇదే తరహాలో చిట్యాల వాగులోనూ 10 హెచ్‌పీ మోటారును ఏర్పాటు చేశారు.

ఆయా ప్రాంతాల నుంచి తరలిస్తున్న నీటిని వ్యవసాయ క్షేత్రంలో భారీగా నిర్మించిన సంప్‌లో నిల్వ చేస్తున్నారు. అక్కడ ప్రత్యేక మోటార్ల ద్వారా పంటలకు సాగునీరు చేరవేస్తున్నారు. వాటికితోడు పొలంలో అక్కడక్కడా మరో 8 బోర్లు కూడా వేశారు. గతంలో పండ్ల తోటలు వేసిన ఆయన తర్వాత వరిని సాగు చేస్తున్నారు. కృష్ణా నది గర్భం నుంచి నేరుగా తన పొలాలకు సాగునీరు చేరవేస్తున్న వెంకటేశ్వరరావు తీరుపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూముల కొనుగోళ్ల విషయంలోనూ తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని పసుపుల గ్రామానికి చెందిన ఆనంద్‌గౌడ్‌ ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

పడకేసిన లిఫ్టు.. 
3,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పసుపులలో రూ. 76 లక్షలతో 1987లో నిర్మించిన దత్తాత్రేయ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం పడకేసింది. దాని నిర్వహణ బాధ్యతను మొదట్లో ప్రభుత్వమే చూసుకున్నా 2002లో రైతులకు అప్పగించడంతో నిర్వహణ భారమై రైతులు ఉపయోగించుకోలేకపోయారు. తాజాగా ఆ లిఫ్టుకు పక్కనే ఆ పథకానికి సమాంతరంగా వెంకటేశ్వరరావు భారీ మోటార్లతో నీటిని తరలించడం గ్రామస్తులను విస్మయానికి గురి చేస్తోంది.

భారీగా విద్యుత్‌ వినియోగం.. 
వ్యవసాయ క్షేత్రానికి నీటి తరలింపు కోసం ఏర్పాటు చేసిన మోటార్లతో విద్యుత్‌ వినియోగం భారీగా ఉంటోంది. కృష్ణా తీరం వద్ద ఉన్న నాలుగు 10 హెచ్‌పీ మోటార్లలో ఒక్కొక్కటి 12 గంటలు పని చేస్తే.. ఏడు కిలోవాట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతుందని, దీన్ని కమర్షియల్‌గా లెక్కిస్తే రూ. 900 బిల్లు అవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. అదే 5 హెచ్‌పీ మోటార్లు పనిచేస్తే రూ. 450 వరకు బిల్లు వస్తుందన్నారు. ఈ లెక్కన ఏళ్ల నుంచి నిరంతరంగా పని చేస్తున్న ఈ భారీ మోటార్లతో విద్యుత్‌ వినియోగం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సర్వీసు చార్జీల కింద రైతులు ప్రతి నెలా చెల్లించే రూ. 30 మాదిరిగానే ఈ భారీ మోటార్లకూ వెంకటేశ్వరరావు అదే చెల్లింపులు చేయడం గమనార్హం.

11 మంది మీద పట్టాలు... 
రెండు గ్రామాల్లో తాను కొనుగోలు చేసిన 117.14 ఎకరాలను వెంకటేశ్వరరావు 11 మంది పేరిట పట్టాలు చేసినట్లు రెవెన్యూ రికార్డులు చూపుతున్నాయి. అయితే వారందరూ స్థానికేతరులు కావడం గమనార్హం. వారు ఎవరో? ఎక్కడి వారో తెలియదని గ్రామస్తులు చెబుతున్నారు. పట్టాలు పొందిన వారిలో కొరుమర్లు వెంకట సత్యనాగమణి తప్ప మిగిలిన వారందరూ తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు బంధు పేరిట ఆర్థిక సహాయాన్ని సైతం పొందడం గమనార్హం. 2018 ఖరీఫ్, రబీ, 2019 ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం కింద మొత్తం రూ. 9,23,900 లబ్ధి పొందారు. మరో రూ. 10,98,400 మంజూరై చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.

భూమికి భూమి ఇస్తామని ఇవ్వలేదు...
మేం ఆరుగురు అన్నదమ్ములం. గ్రామంలో మాకు 12.24 ఎకరాల భూమి ఉండేది. అందులో రెండెకరాల భూమిని అన్నదమ్ములం అందరి సమ్మతంతో మా గ్రామానికి చెందిన ఆశప్పకు అమ్మినం. 2005లో మా గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి వెంకటేశ్వరరావు సార్‌ మీ పదెకరాల భూమి అడుగుతుండ్రు. దానికి బదులు మరోచోట పంటలు బాగా పండే భూమి ఇస్తరు అన్నరు. అప్పుడు మేం ఇద్దరినీ నమ్మి భూమి రిజిస్ట్రేషన్‌ చేసినం. అప్పట్నుంచీ ఇప్పటివరకు మాకు ఎక్కడా భూమి ఇవ్వలేదు. రూ. 20 వేలు మాత్రమే ఇచ్చారు. భూమి ఇప్పించాలని అడుగుతుంటే మా గ్రామ పెద్ద మనిషి తిప్పించుకుంటున్నడు. నాకు న్యాయం చేయండి. – ఆనంద్‌గౌడ్‌ (పసుపుల గ్రామం)

తక్కువ ధరలకు భూములు కొన్నారు.. 
ఎవరో డీఐజీ సార్‌ అట. అప్పట్లో తక్కువ ధరలకు ఇక్కడ భూములు కొన్నారు. కృష్ణా నది నుంచి పైప్‌లైన్ల ద్వారా నేరుగా పొలాలకు నీరు తీసుకెళ్తున్నరు. డబ్బున్న వాళ్లకు ఏదైనా చెల్లుతది. మా లాంటి వాళ్లకు అన్నీ ఆంక్షలే. – లక్ష్మణ్, స్థానికుడు

ఏబీ వెంకటేశ్వరరావు బినామీల పేరిట చేపట్టిన భూ కొనుగోళ్లు ఇలా.. (నోట్‌: ఎకరం=40 గుంటలు)

మరిన్ని వార్తలు