కలాంకు హైదరాబాద్ తో చక్కటి అనుబంధం

28 Jul, 2015 00:11 IST|Sakshi

హైదరాబాద్::‘హైదరాబాద్ ఎంతో అందమైన నగరం. నగరంలో రాక్ గార్టెన్స్ అద్భుతంగా ఉంటాయి.నగర శివార్లలో కనిపించే గుట్టలు,కొండలు చూస్తోంటే కదలాలనిపించదు.ఒకదానిపైన ఒకటి ఎవరో పేర్చినట్లుగా ఉండే రాళ్లు చాలా అందంగా కనిపిస్తాయి.ఈ నగరం అంటే నాకెంతో ఇష్టం..’’ డాక్టర్ అబ్దుల్ కలామ్‌కు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్న చక్కటి అనుబంధం అది. శాస్త్రవేత్తగా, గొప్ప పరిశోధకుడిగా. తత్వవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా హైదరాబాద్ ప్రజల మనస్సు దోచుకున్న ఆయన గొప్ప ప్రకృతి ప్రేమికుడు. ఈ నగరం అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ,అభిమానం ఉన్నాయి.పిల్లలపై ఆయనకు ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కొద్దిగా మూసుకున్నట్లుగా కనిపించే కళ్లు, పెదాలపై చెరగని చిరునవ్వులు,చేయి పెకైత్తి చేసే అభివాదం దృశ్యాలు లక్షలాది మంది చిన్నారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తన పొడవాటి జులపాలను పైకి ఎగదోసుకుంటూ చేసే గంభీరమైన ఉపన్యాసాలు, పిల్లల నుంచి ప్రశ్నలను ఆహ్వానిస్తూ వాటికి సమాధానాలు చెబుతూ సాగిపోయే చర్చా కార్యక్రమాలు నగరంలో ప్రతి ఒక్కరికి సుపరిచితం.బహుశా వందకు పైగా స్కూళ్లు, కళాశాలల్లో ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్ధుల్లో స్ఫూర్తిని,ఉత్తేజాన్ని నింపారు. ఆయన ప్రసంగాల కోసం చిన్నారులు ఎంతో ఆతృతగా చూసేవారు. పిల్లలపై ఆయనకు ఉన్న ప్రేమ కొద్ది ఆయన ఇక్కడ ఒక విద్యాసంస్థనే స్థాపించాలని ఆకాంక్షించారు. కానీ ఆయన ఆశయం నెరవేరలేదు.హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని తన జీవిత చరిత్రలోనూ రాసుకున్నారు.


సెంట్రల్ యూనివర్సిటీకి చిరకాల నేస్తం...


ఆయన హైదరాబాద్ డిఫెన్స్ లాబొరేటరీలో విధులు నిర్వహించే రోజుల్లోనే రెగ్యులర్‌గా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లేవారు. విద్యార్ధులతో ఇష్టాగోష్టుల్లో పాల్గొనేవారు. వారితో మమేకమయ్యేవారు. అప్పటి వైస్ ఛాన్సలర్ పల్లె రామారావు,కలాం ఇద్దరు గొప్ప స్నేహితులు. వాళ్లిద్దరు కలిసి ‘కలాం రావూస్’ స్కూల్‌ను స్థాపించాలనుకున్నారు.ప్రత్యేకించి చదువులో వెనుబడిపోయే విద్యార్ధులను మాత్రమే ఆ స్కూల్లో చేర్చించుకొని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం హైటెక్‌సిటీలో స్థలం కూడా కొనుగోలు చేశారు. కానీ ఎందుకో ఆ ప్రయోగం ముందుకు కొనసాగలేదు.కోట హరినారాయణ సెంట్రల్ వర్సిటీ వీసీగా ఉన్న రోజుల్లో అనేక ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నారు. విద్యార్ధి సంఘాలతోనూ ఆయనకు పరిచయం ఉంది. ప్రసంగం తరువాత ‘ఎనీ కొశ్చన్స్’ అని అడగడం ఆయనకు బాగా అలవాటు.అలాగే ఓ సారి సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కీలక ప్రసంగం తరువాత కూడా అలాగే అడిగాడు.దాంతో విద్యార్ధులు విస్తుబోయారు.


స్కోప్ స్వచ్చంద సంస్థతో కలిసి ఉద్యమం...


ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమించిన పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా నగరంలో స్కోప్ అనే స్వచ్చంద సంస్థ చేపట్టిన ప్రచారోద్యమంలో ఆయన స్పూర్తిగా నిలిచారు. వంద కోట్ల మంది సంతకాల సేకరణ కార్యక్రమంలో మొదటి సంతకం చేశారు. శాస్త్ర పరిశోధన రంగానికి సంబంధించి పిల్లలు,యువకులతో కలిసి ఎక్కువగా చర్చలు జరిపారు. లీడ్ ఇండియా సంస్థతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత భారతీయ విద్యాభవన్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ బిల్వ చెట్టును నాటారు.గన్‌ఫౌండ్రిలోని ఆల్‌సెయింట్స్ హైస్కూల్, షేక్‌పేట్ ఒయాసిస్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సహా అనేక స్కూళ్లలో ఆయన పాల్గొన్నారు.


నగరంలో కలాం జ్ఞాపకాలు...


-2013 ఆగస్టు 27వ తేదీన గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్ధులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.


-గత సంవత్సరం జనవరిలో లాల్‌దర్వాజలోని ఇందిరా విద్యానికేతన్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 45 నిమిషాల పాటు విద్యార్ధులతో ముచ్చటించారు. 100 మంది చిన్నారులు అనేక అంశాలపై కలాంతో మాట్లాడారు.
-2015 మార్చి 20న నగరంలో జరిగిన నైబర్ కాన్వొకేషన్ కార్యక్రమంలో రేర్ డిసీజెస్ పైన ఆయన ప్రసంగించారు.
-టెక్ మహీంద్ర నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన 2015 మే 14న నగరానికి వచ్చారు. ఆయన పాల్గొన్న ఆఖరి కార్యక్రమం అదే.

>
మరిన్ని వార్తలు