అటెండర్‌ చంద్రయ్య, ఏఎస్సై నర్సింహులు మృతి

2 Dec, 2019 09:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయారెడ్డి హత్య కేసులో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన అటెంబర్‌ చంద్రయ్య సోమవారం కన్నుమూశారు. నవంబర్‌ 4న విజయారెడ్డికి అంటుకున్న మంటలను ఆర్పేస్తూ... చంద్రయ్య తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. చంద్రయ్య నెలరోజులుగా..డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. చంద్రయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు.

సరైన వైద్యం అందించకే చంద్రయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారని.. కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారని ఆగ్రహిస్తున్నారు. చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా విజయారెడ్డిపై సురేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటిచగా ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఎమ్మార్వోను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె కారు డ్రైవర్‌ గురునాథానికి మంటలంటుకోవడంతో మరుసటిరోజే మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్‌ డిఆర్డిఓలో చికిత్స పొందుతూ నవంబర్‌ 7న మరణించాడు. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు మరణించారు.

ఏఎస్‌ఐ నర్సింహులు మృతి

చికిత్స పొందుతూ ఏఎస్‌ఐ నర్సింహులు మృతి..
బాలాపూర్‌: ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్‌ఐ నర్సింహులు ఆసుపత్రిలో సోమవారం మృతి చెందాడు. కొన్నిరోజుల క్రితం బాలాపూర్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట పెట్రోలు పోసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహులు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం మరణించాడు. కాగా ఆయన మృతికి సీఐ సైదులు వేధింపులే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చర్యలు చేపట్టిన పోలీసు కమిషనర్‌ సీఐపై బదిలీ వేటు వేశారు.

చదవండి..

తహశీల్దార్‌ సజీవదహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది?

దారుణం: మహిళా తహశీల్దార్‌ సజీవదహనం

మరిన్ని వార్తలు