హయత్‌నగర్‌లో అబ్దుల్లాపూర్‌మెట్‌  తహసీల్‌ కార్యాలయం?

15 Nov, 2019 04:36 IST|Sakshi

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా యంత్రాంగం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని హయత్‌నగర్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. స్థానిక మండల పరిషత్‌ ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగించాలని యోచిస్తోంది. ఇక్కడైతే అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు విస్తృతంగా రవాణా సౌకర్యాలు ఉన్నాయని భావిస్తోంది. అబ్బుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డి సజీవదహనంతో అక్కడి ఉద్యోగులు సదరు కార్యాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇన్‌చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సైతం కార్యాలయానికి వెళ్లేందుకు సాహసించడం లేదు. విజయారెడ్డి హత్య కు గురైన భవనంలో తాము విధులు నిర్వహించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించిన యంత్రాంగం..హయత్‌నగర్‌లోని మండల పరిషత్‌ ప్రాంగణంలోని భవన సముదాయంలో ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుం దని యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. దీని పట్ల ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు