ఏబీకే ప్రసాద్‌ సతీమణి సుధ మృతి

13 Mar, 2018 09:48 IST|Sakshi
సీఆర్‌ ఫౌండేషన్‌లో తన సతీమణి భౌతికకాయం వద్ద విలపిస్తున్న ఏబీకే ప్రసాద్‌. చిత్రంలో కుటుంబ సభ్యులు

సాక్షి, హైదరాబాద్‌ : సీనియర్‌ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌ సతీమణి సుధారాణి కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలకు ఆమె మృతి చెందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రుకు చెందిన సుధారాణిని, కృష్ణా జిల్లా ఉప్పులూరుకు చెందిన ఏబీకే ప్రసాద్‌ 1955లో వివా హం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు హేమలత, స్వర్ణలత, విశ్వభారతి, రాధి క ఉన్నారు. ఏబీకే ప్రసాద్‌ భార్య సుధారాణితో కలసి కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లోని వృద్ధాశ్రమంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు.

నివాళులర్పించిన ప్రముఖులు 
కిమ్స్‌ ఆస్పత్రి నుంచి మంగళవారం ఉదయం సుధారాణి భౌతికకాయాన్ని సీఆర్‌ ఫౌండేషన్‌కు తీసుకొచ్చారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సాక్షి ఫైనాన్స్‌ అండ్‌ అడ్మిన్‌ డైరెక్టర్‌ వైఈపీ రెడ్డి, ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, ఎడిటర్‌ వర్దెల్లి మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్, వార్త ఎడిటర్‌ సాయిబాబా, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ, ఇతర పాత్రికేయ ప్రముఖులు నివాళులర్పించారు. ఏబీకే ప్రసాద్‌ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

సుధారాణి చితికి నిప్పంటించిన సోదరుడు
ఏబీకే ప్రసాద్‌ సతీమణి సుధారాణి అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. సుధారాణి చితికి ఆమె సోదరుడు చలసాని వేణుదుర్గాప్రసాద్‌ నిప్పంటించారు. సుధారాణి మృతితో చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వృద్ధాశ్రమంలోని పలువురు ప్రముఖులు సుధారాణికి నివాళులర్పించారు. ఆప్తురాలిని కోల్పోయామని కన్నీళ్లపర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు