అబార్షన్లు ఆగట్లేదు!

10 Feb, 2020 04:02 IST|Sakshi

రాష్ట్రంలో ఏడాదికేడాది పెరిగిపోతున్న సంఖ్య

2016–17లో 6,481 మందికి.. 2018–19లో 8,154 మందికి..

అందులో 47 శాతం అబార్షన్లు అనర్హుల చేతిలోనే

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అబార్షన్లు ఏడాదికేడాదికి పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో తెలంగాణలో 27,559 మంది మహిళలకు అబార్షన్లు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. ఈ అబార్షన్లలో కొన్నింటిని బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు గైనకాలజిస్టుల సలహా మేరకు చేస్తారు. కానీ మరికొన్ని అబార్షన్లు మాత్రం ఆడబిడ్డను వదిలించుకోవడానికి జరుగుతున్నవిగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2016–17 నుంచి 2019–20 (డిసెంబర్‌ నాటికి) దేశవ్యాప్తంగా 45.24 లక్షల అబార్షన్లు జరిగాయి.

ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువగా కనిపిస్తున్నా, ఏటేటా ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. పాత అబార్షన్ల చట్టం ప్రకారం 20 వారాల వరకు జరిగే అబార్షన్లకు మాత్రమే చట్టబద్ధత కల్పించింది. దీనివల్ల నిజమైన కారణాలు ఉన్నప్పటికీ అబార్షన్లు చేసే అవకాశం లేక కొంత మంది అశాస్త్రీయ పద్ధతులను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన కేంద్రం అబార్షన్ల గడువును 24 వారాలకు పొడిగించింది.

వారి చేతిలోనే 46.6%.. 
కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం దేశంలో 46.6 శాతం అబార్షన్లు వైద్యులు కానివారు చేస్తున్నారు. వాస్తవంగా గైనకాలజిస్ట్‌ మాత్రమే ఈ అబార్షన్లను చేయాలి. అది కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. కానీ నర్సులు, మంత్రసానులు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు, కుటుంబ సభ్యులు లేదా వ్యక్తిగతంగా కొందరు అనైతికంగా అబార్షన్లు చేస్తున్నారు. 27.4 శాతం అబార్షన్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి.

అనైతిక అబార్షన్లు నేరం.. 
అనైతికంగా ఎవరుపడితే వారు అబార్షన్లు చేయడం నేరం. కేవలం గైనకాలజిస్ట్‌లు మాత్రమే తల్లి, బిడ్డల ఆరోగ్య విషయాలు పరిశీలించి, సమస్య వస్తేనే 20 వారాల గడువులోగా అబార్షన్‌ చేయాలి. డాక్టర్‌ కానివారు ఎవరైనా అబార్షన్‌ చేయకూడదు. చాలామంది ప్రైవేటు ప్రాక్టీషనర్లు ఆడబిడ్డ ఉందని గుర్తించి, తల్లిదండ్రుల విన్నపం మేరకు అబార్షన్లు చేస్తున్నారు. ఇది అనైతికం. ఆడబిడ్డ కడుపులో ఉన్న విషయాన్ని స్కానింగ్‌ ద్వారా తెలుసుకొని కొందరు తీవ్రమైన తప్పుకు ఒడిగడుతున్నారు. మేము అలాంటి వాటిపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం.  –డాక్టర్‌ కృష్ణవేణి, గైనకాలజిస్ట్, హైదరాబాద్‌ 

వివిధ సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన అబార్షన్ల సంఖ్య

మరిన్ని వార్తలు