2,500 రైతు సమావేశ మందిరాలు

5 Jul, 2017 03:30 IST|Sakshi
2,500 రైతు సమావేశ మందిరాలు

- రూ.375 కోట్లతో నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం..
సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రవ్యాప్తంగా 2,500 రైతు సమావేశ మందిరాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ మూడునాలు గు గ్రామాలకు ఒక సమావేశ మందిరాన్ని రూ.15 లక్షల ఖర్చుతో నిర్మించనుంది. ఇందుకోసం రూ.375 కోట్లు కేటాయించింది. అరెకరం స్థలంలో దాదాపు ఐదారు వందల మంది రైతులు కూర్చునేలా, వారికి శిక్షణ ఇచ్చేలా ఈ మందిరాలను తీర్చిదిద్దనున్నారు. ఈ ఏడాది నుంచే స్థలాల సేకరణ జరిపి, వీలైనంత త్వరగా నిర్మించాలని నిర్ణయిం చారు. వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) పరిధిని యూనిట్‌గా నిర్ణయించి, వారి కేంద్రంగా ఉండే గ్రామంలో ఈ మందిరాలు నిర్మిస్తారు. సాధారణంగా ఒక ఏఈవో మూడు నాలుగు గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. రైతులకు సంబంధించి ప్రతీ కార్యక్రమాన్ని, పథకాలను ఏఈవో కేంద్రంగానే అమలుచేస్తారు. దీంతో ఏఈవో యూనిట్‌ గ్రామాల్లో అరెకరం స్థలాన్ని గుర్తించాలని వ్యవసాయ శాఖ ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో స్థల సేకరణ సులువు కాబట్టి త్వరలోనే గుర్తించి నిర్మాణాలు చేపడతారు. అందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తి
వచ్చే ఏడాది నుంచి ప్రతీ రైతుకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖను బలోపేతం చేస్తోంది. తాజాగా ఏర్పాటు చేయనున్న రైతు సమావేశ మందిరాల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ధాన్యాన్ని సేకరించే కార్యక్రమం కూడా జరుగుతుంది. రైతుకు కష్టమొచ్చినా నష్టమొచ్చినా అక్కడే చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామ, మండల రైతు సమాఖ్యలు ఏర్పాటయ్యాక వాటి కార్యకలాపాలు కూడా ఈ రైతు సమావేశ మందిరాల్లోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అన్ని సమావేశ మందిరాల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పోచారం తెలిపారు. ఈ ఏడాది స్థలాన్ని గుర్తిస్తే తక్షణమే వాటి నిర్మాణాలు జరుపుతామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు