‘అధికార’ దుర్వినియోగం

6 Jul, 2014 02:27 IST|Sakshi
‘అధికార’ దుర్వినియోగం

- మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లోటీఆర్‌ఎస్ దౌర్జన్యం
- కాంగ్రెస్ ఎంపీటీసీలను ఇబ్బందిపెట్టారు
- రాజకీయాలు మాని అభివృద్ధికి పాటుపడాలి
- ‘బంగారు తెలంగాణ’కు కాంగ్రెస్ సహకారం
- శాసనమండలి ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్, ఎంపీపీల ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికార
దుర్వినియోగానికి పాల్పడిందని, పలుచోట్ల ఘర్షణలను ప్రోత్సహించే విధంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకత్వం వ్యవహరించిందని పీసీసీ మాజీ చీఫ్, శాసనమండలి పక్షనేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) ఆరోపించారు. ఎన్నికల సందర్భం గా ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అమరుల కలలు సాకారం అయ్యే విధంగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాల్సిన నాయకత్వం దౌర్జన్యకర వాతావరణం నెల కొ ల్పడం బాధాకరమన్నా రు. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను అధికార పార్టీ అడుగడుగున్నా ఇబ్బందులకు గురి చేసింద ని, ఎన్నికల్లో వచ్చిన ఎంపీటీసీ స్థానాల ప్రకారం తమకు ఎంపీపీ పదవులు రాకుండా ప్రలోభపెట్టిందని ఆయ న ఆరోపించారు. శనివారం నిజామాబాద్‌లోని తన ఇంట్లో విలేకరుల సమావేశంలో డీఎస్ కాంగ్రెస్ జడ్‌పీటీసీ సభ్యులతో కలిసి మాట్లాడారు.
 
తెలంగాణ కాంగ్రెస్ చలవే
తెలంగాణ రాష్ర్టం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చిందన్నారు. తెలంగాణలో యువకుల బలిదానాలకు చలించిన సోనియాగాంధీ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అమరుల త్యాగాల కారణంగా ఏర్పడిన రాష్ట్రంలో పార్టీలకతీతంగా అందరిని కలుపుకొని అభివృద్ధికి బాటలు వేయాల్సిన టీఆర్‌ఎస్ అప్రజాస్వామి కంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొల్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశమున్న ప్రతిచోట ఆటంకాలు కల్పించిందన్నారు.

నిజామాబాద్, డిచ్‌పల్లి ఎంపీపీల ఎన్నికల విషయంలో టీఆర్‌ఎస్ లేనిపోని రాద్దాంతం చేసి ఎన్నికలు వాయిదా వేయించాలని కుట్రలు చేసినా... చి వరకు కాంగ్రెస్‌కే విజయం చేకూరిందన్నారు. తన నియోజకవర్గంలో ఐదు మండలాలకు గాను నాలుగు మండలాల్లో కాంగ్రెస్ ఎంపీపీలను గెలిపించిన ప్రజలు, నాయ కులు, కార్యకర్తలు, సభ్యులకు డీఎస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎంపీటీసీలను అడ్డుకుని అరాచకాలు సృష్టించినా.. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడినా చివరకు జిల్లాలో 11 ఎంపీపీ స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు విజయం చేకూర్చారన్నారు.
 
సర్కారుకు సహకరిస్తాం
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరిస్తుం దని డీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని సమష్టిగా కృషి చేస్తేనే అమరుల ఆశయాలు, కలలు సాకారమవుతాయన్నారు. రాజకీయంగా తమను, తమ కార్యకర్తల ను ఎంత ఇబ్బంది పెట్టాల ని చూసినా.. ఈ రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందని, నిర్మాణాత్మక సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

శాసనసభ, శాసనమండలిలలో జానారెడ్డి, తాను గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపే ప్రసంగం సందర్భంగా కూడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడ స్పష్టంగా చెప్పామని డీఎస్ తెలిపారు. జిల్లా పరిషత్‌లోను తమ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పాలకవర్గానికి చేదోడువాదోడుగా ఉంటారన్నారు. జిల్లా పరిషత్ నిధుల తో అభివృద్ధి జరిగేలా పాలకపక్షం చూడాలని, నిధుల కేటాయింపులో పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారు.

పార్టీలకతీతంగా జడ్పీ నిధులు మండలాలకు కేటాయించాల ని, ఆ నిధుల్లో ఇతరుల పెత్తనం లేకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు జిల్లా అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో డిచ్‌పల్లి, నిజామాబాద్, బోధన్, సిరికొండ, జక్రాన్‌పల్లి, మాచారెడ్డి, నవీపేట జడ్పీటీసీ సభ్యులు కూరపాటి అరుణ, పుప్పాల శోభ, అల్లె లావణ్య, అయిత సుజా, పొట్కూరి తనూజరెడ్డి, గ్యార లక్ష్మి, ఎ.శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు