ప్రైవేటు పాఠశాలలకు ఏబీవీపీ డిమాండ్లు

11 Jun, 2019 19:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయని ఏబీవీపీ ఆరోపించింది. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిబంధనలకు లోబడి ఫీజును నియంత్రణలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రైవేటు యాజమాన్యాలు అధికంగా ఫీజులు పెంచడం వల్ల ప్రైవేటు పాఠశాలల్లో చదవాలనుకునే పేద విద్యార్థులు ఆ కోరిక కలగానే మిగులుతోందని ఏబీవీపీ పేర్కొంది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తింది. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ముందువుంచింది.

ఏబివీపీ డిమాండ్లు ఇవి..

  • తరగతుల వారిగా ప్రైవేటు పాఠశాల ఫీజు వివరాలను వెల్లడించాలి. తప్పనిసరిగా ఫీజు నియంత్రణ చట్టం అమలుపరచాలి. 
  • ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. వీటిని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి కూడా విస్తరించాలి.
  • విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్య సంవత్సరం నుంచే పటిష్టంగా అమలుపరచాలి. పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి.
  • పాఠశాల ఆవరణలో విద్యార్థులను తప్పుదారి పట్టించే ఎలాంటి అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. 
  • ప్రమాదాలు జరగకుండా పాఠశాల బస్సుల ఫిటినెస్ పరీక్షించే విధంగా చూడాలి. 
  • చదువుతో పాటు విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండటానికి ప్రతి స్కూల్‌కు క్రీడా మైదానం ఉండేట్టు చూడాలి.
  • లాబ్స్, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ, టాయిలెట్స్ తదితర కనీస సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ  పోస్టులను భర్తీ చేయాలి. 
  • ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి.
  • పాఠశాలలు తప్పనిసరిగా అనుమతులు తీసుకునే విధంగా చూడాలి.
  • అనుమతి తీసుకోని పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ లిస్ట్ ను బహిర్గతం చేయాలి.
మరిన్ని వార్తలు