అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం

11 Mar, 2020 12:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వెనక్కు నెట్టారు.అయినప్పటికీ ఏబీవీపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

9 యూనివర్సీటీలకు వెంటనే వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న 50వేల టీచర్ల పోస్టులను, జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని దాని వల్ల తమకు స్కాలర్ షిప్‌లు రావడం లేదని విద్యార్థులు మీడియాకు చెప్పారు. ఈ డిమాండ్ తీర్చడం కోసమే అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు