సండ్రను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి: ఏసీబీ

7 Jul, 2015 11:10 IST|Sakshi
సండ్రను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి: ఏసీబీ

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను మంగళవారం  ఏసీబీ కోర్టుకు తరలించారు. ఆయనను అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈరోజు  ఉదయం సండ్రను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న ఉదయం నుంచి దాదాపు 7గంటల పాటు విచారించిన మీదట సండ్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సండ్ర అరెస్ట్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమేగాకుండా అతని కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు.

 ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో సండ్ర కీలక పాత్ర వహించారని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే కేసులో A-4 నిందితుడైన మత్తయ్యకు సండ్ర 8 కాల్స్‌ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. మరోవైపు ఏసీబీ ముందు హాజరుకావాల్సిన జిమ్మీబాబు జాడ లేకుండా పోయాడు. ముత్తయ్య దారిలోనే అతను కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అందుకే అతను ఏసీబీ విచారణకు హాజరుకాలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో తనను కూట్రపూరితంగా ఇరికించారని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

మరిన్ని వార్తలు