ఏసీబీ వలలో మత్స్యశాఖ అవినీతి చేప

26 Sep, 2018 07:40 IST|Sakshi
లంచం తీసుకున్న వెంకటేశ్వర్లు, శివను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ కిరణ్‌

కరీంనగర్‌క్రైం: ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ డబ్బులు అందించడానికి రూ.10 వేల లంచం తీసుకుంటూ  కరీంనగర్‌ మత్య్స శాఖ కార్యాలయం సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి శివ మంగళవారం ఏసీబీకి చిక్కారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన మత్య్స కార్మికుడు పిల్లి స్వామి 1.25 లక్షలు బ్యాంక్‌లో చెల్లించి సబ్సిడీలో టాటాఏస్‌ వాహనం కొనుగోలు చేశాడు. తరువాత సబ్సిడీలోన్‌ కోసం కరీంనగర్‌ మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 3.75 లక్షల రుణం మంజూరైంది. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు మత్య్సశాఖ కార్యాలయం సూపరింటెండెంట్‌ బంది వెంకటేశ్వర్లు రూ.15 వేల లంచం డిమాండ్‌ చేశాడు.

అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా వినలేదు. చివరకు రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. మొదట రూ.5వేలు తీసుకున్న వెంకటేశ్వర్లు మళ్లీ రూ. 10వేలు ఇస్తేనే మంజూరైన రుణాన్ని ఇస్తానని తెగేసి చెప్పాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన పిల్లి స్వామి ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కరీంనగర్‌ మానేరు డ్యాం వద్ద ఉన్న మత్య్సశాఖ కార్యాయలంలో మంగళవారం రూ.10వేలు అందించేందుకు వచ్చాడు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి శివ ద్వారా సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం రికార్డులను ఏసీబీ ఆఫీస్‌కు తరలించారు. నిందితులను నేడు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నామని డీఎస్పీ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు