ఏసీటీవో ఇంటిపై ఏసీబీ దాడులు

5 Aug, 2017 02:07 IST|Sakshi
రూ.5 కోట్ల మేర ఆస్తులున్నట్లు గుర్తింపు!
 
జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వాణిజ్య పన్నుల కార్యాలయంలో ఏసీటీఓగా విధులు నిర్వర్తిస్తున్న బత్తిని సురేందర్‌గౌడ్, ఆయన బంధువుల ఇళ్లపై శుక్రవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బాదేపల్లిలోని తాలూకా క్లబ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న సురేందర్‌గౌడ్‌ ఇంట్లో తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా 49 తులాల బంగారు ఆభరణాలు, 1.30 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన భార్య ఇందిర, కుమార్తె స్వప్న పేరిట మూడు ప్లాట్లు, రెండు కార్లు, విద్యానగర్‌ కాలనీలో ఆయన కుమారుడు శ్రీకాంత్‌గౌడ్‌ పేరిట పది పోర్షన్లు కలిగిన మూడు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ ఉన్నట్లు గుర్తించారు.

అలాగే, మహబూబ్‌నగర్‌లో ఇరిగేషన్‌ డీఈగా పనిచేస్తున్న సురేందర్‌ అల్లుడు మురళీధర్‌గౌడ్‌ ఇంట్లోనే కాకుండా నల్లగొండ జిల్లా మోతె మండలం ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న కుమారుడు శ్రీకాంత్‌గౌడ్‌ ఇంటిపై కూడా ఓ బృందం దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్‌ విలేకరులకు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం ఏటిదర్‌పల్లి, తిమ్మాజీపేట మండలం మారేపల్లి, జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామాల్లోని ఆయన బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులు సుమారు రూ.5 కోట్ల మేర ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు