రూ.5వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వీఆర్‌ఓ

21 Nov, 2018 11:53 IST|Sakshi
వీఆర్‌ఓను విచారిస్తున్న డీఎస్పీ భద్రయ్య

సాక్షి,భీమదేవరపల్లి(హుస్నాబాద్‌): ఆర్వోఆర్‌ పట్టా చేసేందుకు ఓ రైతు వద్ద నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటూ వీఆర్‌ఓ గుమ్మడి రమేష్‌ ఏసీబీకి చిక్కిన ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ వరంగల్‌ డీఎస్పీ కడారి భద్రయ్య కథనం ప్రకారం... మండల పరిధిలోని  వంగర రెవెన్యూ గ్రామ పరిధి రంగయపల్లికి చెందిన బొల్లవేన రవికి వంగర గ్రామ శివారులో అతని తండ్రి మల్లయ్య పేరిట 766సర్వే నంబర్‌లో 3.16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తండ్రి పేరిట ఉన్న భూమిని కుమారులైన రవి, కుమారస్వామి పేరిట మార్పిడి కోసం గత ఏడాది క్రితం ఆర్వోఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఆ భూమికి సంబంధించి వివరాలు సక్రమంగా ఉండడంతో ఆర్వోఆర్‌ అమలు చేసేందుకు అప్పటి తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ మల్లయ్యకు ప్రొసిడింగ్‌ జారీ చేశారు. పట్టదారు పాసు బుక్కు కోసం ఆరు మాసాలుగా రవి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. రూ. 15వేలు ఇస్తే పాసు బుక్కు ఇస్తానంటూ వంగర వీఆర్‌ఓ గుమ్మడి రమేష్‌ సదరు రైతుకు చెప్పాడు. తన దగ్గర అంత డబ్బులు లేవని రూ. 5వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో రైతు రవి నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు రవి రూ. 5వేలు తీసుకొని మంగళవారం భీమదేవరపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. కార్యాలయం వెనకల సదరు రైతు వీఆర్‌ఓ రమేష్‌కు రూ. 5వేలు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్‌ఓ రమేష్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇందులో సీఐలు సతీష్‌కుమార్, క్రాంతి కుమార్, వెంకట్‌ ఉన్నారు. 

పదేళ్లలో ఆరుగురు....
భీమదేవరపల్లి మండలంలో పదేళ్ల కాలంలో ఐదుగురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. పదేళ్ల క్రితం ఏఎస్‌డబ్ల్యూవో, తహసీల్దార్‌ వామన్‌రావు, ఆరేళ్ల క్రితం తహసీల్దార్‌ చంద్రలింగం, ఎస్టీవో జోగ్యానాయక్, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అటెండర్‌గా చేసిన కనకయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తాజాగా వీఆర్‌ఓ రమేష్‌ ఏసీబీకి చిక్కడంతో భీమదేవరపల్లిలో చర్చనీయశంగా మారింది.  అవినీతికి పాల్పడుతున్న మరో ఇద్దరు వీఆర్‌ఓలపై సైతం ఫిర్యాదులున్నట్లు వారిపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించా.. 
పట్టదారుపాసు బుక్కు కోసం విసిగి పోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఆరు నెలలుగా పట్టదారు పాసుబుక్కు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. పంట రుణం కోసం బ్యాంక్‌కు పోతే పాసు బుక్కు అడుగుతండ్లు. వీఆర్‌ఓను బుక్కు అడిగితే  రూ. 15వేలు ఇస్తేనే పాసుబుక్కు ఇస్తానన్నాడు. అన్ని డబ్బులు నా దగ్గర లేవు రూ. 5వేలు ఇస్తానని చెప్పిన. ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవ్వు. దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – బొల్లవేన రవి
 

మరిన్ని వార్తలు