ఏసీబీ వలలో ఎంఈఓ

6 Aug, 2019 12:39 IST|Sakshi
ఎంఈఓ చేతిలో నోట్లను పక్కకు పెడుతున్న ఏసీబీ అధికారి 

రూ.లక్షల జీతం ఉన్నా.. లంచాలు కావాలి

విద్యావ్యవస్థలో లంచావతారి

సాక్షి, బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం  చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేలల్లో జీతాలను ఇస్తుంటే అవేవి చాలవన్నట్లు అదే ప్రభుత్వ ఉపాధ్యాయుల వద్ద లంచాలను తీసుకుంటున్నారు.  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి తేలుకంటి ముత్తయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా చిక్కిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ, ఇన్‌చార్జి మండల విద్యాధికారిగా కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.

మండలంలోని నాగిరెడ్డిపల్లి  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్దికుంట కృష్ణారెడ్డి ఆరోగ్యం సహకరించక అనారోగ్యంతో జూలై 17, 18న సెలవులు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఎంఈఓ ముత్తయ్య ఆ పాఠశాలను ఆ సమయంలో  తనిఖీ చేశాడు. మరుసటి రోజు డీఈఓ యాదయ్య కూడా అదే పాఠశాలను తనిఖీ చేయగా హెచ్‌ఎం లేక పోవడంతో ఆయన స్థానంలో  విద్యావలంటీర్‌ ఉండడంతో, సమాచారం లేకుండా సెలవు ఎలా పెడతాడని ఆగ్రహం వ్యక్తం చేసి హాజరు రిజిస్టర్‌లో రిమార్కు వేశాడు. ఈ సాకును అదనుగా తీసుకున్న ఎంఈఓ ముత్తయ్య హెచ్‌ఎం కృష్ణారెడ్డిని సస్పెండ్‌ చేయిస్తానని వేధించసాగాడు. డబ్బులు ఇస్తేనే అన్ని వ్యవహారాలు చక్కగా ఉంటాయని లేనిచో శాఖాపరమైన చర్యలు తప్పవని పలు మార్లు హెచ్చరించాడు. ఇందులో పలువురు ఉపాధ్యాయులు మధ్యవర్తిత్వం చేసి చివరకు రూ.30 వేలు ఇవ్వాలని రాజీ కుదిర్చారు.

దీనికి కృష్ణారెడ్డి కూడా ఒప్పుకొని  ముందుగా రూ.10 వేలు ఇస్తానని తెలిపాడు. అనంతరం ఈ విషయంపై హెచ్‌ఎం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు అనుకున్నట్టుగానే ముందుగా రూ.10 వేలు అన్నీ ఐదు వందల రూపాయల నోట్లను కృష్ణారెడ్డికి  ఏసీబీ అధికారులు ఇచ్చి పాఠశాలకు సోమవారం పంపించారు. కృష్ణారెడ్డి ఎంఈఓ ముత్తయ్యకు డబ్బులు ఇచ్చి పాఠశాల గేట్‌ కూడా దాటకముందే అనుకున్న పథకం ప్రకారం ఏసీబీ అధికారులు ముత్తయ్యను రెడ్‌ హ్యాడెపట్టుకున్నారు. ఈ దాడుల్లో సీఐ రవి, ఇన్‌స్పెక్టర్లు సతీష్, క్రాంతితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు