ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

25 Sep, 2014 03:20 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

తిమ్మాపూర్ : ఆన్‌లైన్ పహాణిలో పేరు నమోదు చేసేందుకు రూ.ఐదు వే లు లంచం అడిగి.. డ్రైవర్ ద్వారా వసూలు చేస్తూ.. మానకొండూర్ తహశీల్దార్ ఆర్.రాంబాబు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు చిక్కారు. తహశీల్దార్‌తోపాటు అతడి డ్రైవర్‌ను ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, ఇన్స్‌పెక్టర్లు, సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన గొల్లిపల్లి రవి తన తండ్రి చంద్రయ్య మరణించడంతో తల్లి లక్ష్మి పేరిట భూ మార్పిడికి రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. అయితే చంద్రయ్య పేరిట సర్వేనంబర్ 511/బీ, 564లో ఉన్న 43 గుంటల స్థలానికి ఆన్‌లైన్ పహాణి లేదు. దీంతో రవి ఈనెల 2న తహశీల్దార్ రాంబాబును కలిసి.. పరిస్థితిని వివరించి దరఖాస్తు చేసుకున్నాడు. పేరు నమోదు కు రూ.5వేలు ఖర్చవుతుందని చెప్పగా రవి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి పథకం ప్రకారం బుధవారం ఉదయం మానకొండూర్‌లోని కార్యాలయంలో రవి తహశీల్దార్‌ను కలిసి డబ్బులు ఇవ్వబోగా.. తన కారు డ్రైవర్ జానీపాషాకు ఇవ్వాలని చెప్పాడు. అత డు జానీకి రూ.ఐదు వేలు ఇవ్వడం.. రాంబాబు తన కారులో అల్గునూర్‌లోని అద్దె ఇంటికి చేరడం.. వారిని వెంబడి స్తూ ఏసీబీ అధికారులు రావడం.. డ్రైవర్ వద్ద రూ.5వేలు పట్టుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. తహశీల్దార్‌తోపాటు కారుడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఇన్స్‌పెక్టర్లు వీరభద్రం, రమణమూర్తి, విజయ్‌భాస్కర్, వేణుగోపాల్ ఉన్నారు.
 తహశీల్దార్‌పై అన్నీ ఫిర్యాదులే..
 తహశీల్దార్ రాంబాబుపై గతంలో మండలానికి చెందిన చాలామంది ఇసుక, మైనింగ్, రెవెన్యూ సమస్యలపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అనంతరం డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ లం చం కోసం ఎవరైనా వేధిస్తే 94404 46150 నం బర్‌కు ఫోన్ చేయాలని, మెసేజ్ చేసినా స్పంది స్తామని వివరించారు. తహశీల్దార్ ఏసీబీకి పట్టు బడ్డాడనే విషయం తెలుసుకుని మానకొండూర్ మండల ప్రజలు అల్గునూర్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. రాంబాబును పట్టించిన రవిని అభినందించారు.
 రికార్డులు సీజ్
 మానకొండూర్ : తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, సీఐ వీరభద్రం రికార్డులను పరిశీలించారు. 1బీ రికార్డుతోపాటు వివిధరకాల రికార్డులు సీజ్ చేశారు.


 

మరిన్ని వార్తలు