శివారుపై ఏసీబీ కన్ను

12 Jun, 2020 04:10 IST|Sakshi

విలువైన భూములు, వివాదాస్పద నిర్ణయాలపై సమాచార సేకరణ

మేడ్చల్,రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ వ్యవహారాలపై ఆరా

అవినీతి బాగోతాలపై ప్రభుత్వానికి నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: శివారు మండలాలపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. అవినీతి రెవెన్యూ అధికారుల భరతం పట్టేందుకు సమాచారం సేకరిస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ).. రాజధాని చుట్టూరా ఉన్న జిల్లాల్లోని తహసీల్దార్ల వ్యవహారశైలిపై నిఘా పెట్టింది. ప్రజల్లో అవినీతి అప్రతిష్టను మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఇటీవల షేక్‌పేట మండల తహసీల్దార్, ఆర్‌ఐ ఏసీబీ వలలో చిక్కడం సంచలనం కలిగింది. ఒక భూ వివాదంలో తలదూర్చిన ఈ రెవెన్యూ ద్వయం ఏకంగా రూ.50 లక్షల డీల్‌ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలడం ప్రభుత్వాన్ని నివ్వెర పరిచింది. గతేడాది రంగారెడ్డి జిల్లా తహసీల్దార్‌ కూడా రూ.93 లక్షల నగదుతో పట్టుబడ్డారు.

ఈ నేపథ్యంలోనే అక్రమార్కుల చిట్టాను తయారు చేసిన ఏసీబీ.. ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌ పరిసరాల్లో భూముల రేట్లు నింగినంటడం, రెవెన్యూ తగాదాలు కూడా గణనీయంగా పెరిగిపోవడంతో ఇదే అదనుగా అధికారుల అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే శివారు మండలాల పోస్టింగ్‌లకు పోటీ తీవ్రంగా ఉంటోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ క్షేత్రస్థాయిలో అవినీతి తిమింగలాల సమాచారాన్ని రాబడుతోంది. విలువైన భూములు, వివాదాస్పద భూములపై తహసీల్దార్లు తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అంతేగాకుండా రెవెన్యూ వ్యవహారాల్లో అధికారుల కుటుంబసభ్యులు, పైరవీకారుల పాత్రను కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

గాడ్‌ఫాదర్‌ల అండతో...
కొలువులో చేరింది మొదలు పదవీ విరమణ వరకు అక్కడే నెలవు. పదో న్నతులు లభించినా.. బది లీ ఉత్తర్వులు అందినా.. గాడ్‌ఫాదర్‌ల అండ తో పక్క మండలాలకు వెళతారే తప్ప పొరపాటున జిల్లా సరిహద్దు దాటరు. ఒకవేళ కాదు కూడదని ప్రభుత్వం బదిలీ చేసినా.. పోస్టింగ్‌లో చేరకుండా కాలయాపన చేస్తా రు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్‌ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను కదలించడం అంత ఆషామాషీ కాదు. వీరి పలుకుబడి ముందు ఐఏఎస్‌ అధికారులు బలాదూరే. నయాబ్‌ తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరి అదనపు కలెక్టర్‌గా అవే జిల్లాల్లో రిటైర్‌ అవుతున్నారంటే ప్రభుత్వంలో వీరికున్న పలుకుబడి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన భూ వివాదాలను అనువుగా మలుచుకుంటున్న రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు.  భూ విలువలు కోట్లలో పలుకుతుండటం.. భూ మాఫియా, రియల్టర్లు ఎంతైనా ఇచ్చుకునేందుకు ఆఫర్లు ఇస్తుండటంతో ఎందాకైనా వెళ్లేందుకు రెవెన్యూ గణం సాహసిస్తోంది. దీంతో శివారు మండలాల్లో పోస్టింగ్‌లు హాట్‌కేకులా మారిపోయాయి. తమకు అనువుగా ఉండే అధికారిని ఈ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రజాప్రతినిధులు మొదలు బడాబాబుల వరకు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు