‘లెజెండ్‌’ శ్రీహరికి బినామీనే..

6 Jan, 2020 04:11 IST|Sakshi

కీలక ఆధారాలు సంపాదించిన ఏసీబీ

ఓమ్నీకి వచ్చిన కిట్లనే లెజెండ్‌ కంపెనీ ద్వారా సరఫరా

లెజెండ్‌ ఖాతాల నుంచి ఓమ్నికి డబ్బులు బదిలీ

రూ.54 కోట్ల నగదు లావాదేవీలపై ఆధారాలు..  

సాక్షి, హైదరాబాద్‌: ‘వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు’అన్న సామెత ఈఎస్‌ఐ మందుల గోల్‌మాల్‌లో అక్రమాలకు చక్కగా సరిపోతుంది. ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌)లో మందుల కోనుగోళ్ల గోల్‌మాల్‌కు సంబంధించి ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కీలక సాక్ష్యాలు సేకరించింది. ఐఎంఎస్‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులను తన గుప్పిట పెట్టుకున్న శ్రీహరి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టినట్లు గుర్తించింది. తన కంపెనీకి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టించుకున్నదే కాకుండా.. తన బినామీ కంపెనీలకూ నకిలీ అర్హత పత్రాలతో కాంట్రాక్టులు ఇప్పించుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. బినామీ కంపెనీకి ఐఎంఎస్‌ చెల్లించిన డబ్బును తర్వాత తన ఖాతాలోకి ఎలా మళ్లించుకున్నాడో ఆధారాలూ సంపాదించింది.

నకిలీ చిరునామా, కంపెనీ, సర్టిఫికెట్లు
ఐఎంఎస్‌ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనేక కాంట్రాక్టులు పొందిన శ్రీహరిబాబు 2017–18లో ఏకంగా లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట ఓ డొల్ల కంపెనీని సృష్టించాడు. దానికి కృపాసాగర్‌రెడ్డి అనే వ్యక్తిని యజమానిగా పెట్టాడు. దానికి డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించే సమయంలో కూకట్‌పల్లి, రాజీవ్‌గాంధీనగర్‌ చిరునామాగా పేర్కొన్నాడు. అసలు ఈ చిరునామాలో ఎలాంటి కంపెనీ లేదు. మరోవైపు స్వీడన్‌కు చెందిన హోమోక్యూ అనే కంపెనీ తెల్ల రక్తకణాలను పరీక్షించే కిట్ల (డబ్ల్యూబీసీ)ను భారత్‌లో సరఫరా చేస్తోంది. వీటిని సరఫరా చేసే అనుమతులు ఓమ్నీకి ఉన్నాయి. ఇక్కడే శ్రీహరి తన తెలివితేటలు చూపించాడు. తాను హోమోక్యూ కంపెనీ నుంచి డబ్ల్యూబీసీ కిట్లను ఒక్కోటి రూ.11,800లకు కొన్నాడు.

వీటిని లెజెండ్‌ కంపెనీ ద్వారా రూ.36,800లకు ఐఎంఎస్‌కు విక్రయించాడు. రెండు కంపెనీల ఇన్వాయిస్‌లను పరిశీలించగా.. 2017 ఆగస్టు 11న ఈ కిట్లు ఓమ్నీ కంపెనీకి హోమోక్యూ సరఫరా చేయగా.. లెజెండ్‌ కంపెనీ 12న ఐఎంఎస్‌కు సరఫరా చేసింది. దీనివల్ల రూ.54 కోట్లు ఐఎంఎస్‌ ద్వారా లెజెండ్‌ కంపెనీ ఖాతాలోకి వెళ్లాయి. ఈ తతంగానికి హోమో క్యూ కంపెనీ ఏపీ–తెలంగాణ రీజినల్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ పూర్తిగా సహకరించాడు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.11.07 కోట్లు నష్టం వాటిల్లింది. విషయం తెలిసిన హోమోక్యూ కంపెనీ తమకూ లెజెండ్‌ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

రెండు కంపెనీల కిట్లకు ఒకటే బ్యాచ్‌ నంబర్‌..
వాస్తవానికి లెజెండ్‌ కంపెనీ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ ద్వారా రిజిస్టరైనా.. దానికి ఈ కిట్లను సరఫరా చేయాలంటే హోమోక్యూ నుంచి డిస్ట్రిబ్యూటరై ఉండాలి. కానీ, లెజెండ్‌ హోమోక్యూ డిస్ట్రిబ్యూటర్‌ అంటూ శ్రీహరి ఓ నకిలీ సర్టిఫికెట్‌ను కూడా సృష్టించాడు. ఇక శ్రీహరి చెప్పిన రేటును ఆమోదిస్తూ అప్పటి డైరెక్టర్‌ దేవికారాణి, డిప్యూటీ డైరెక్టర్‌ కలకుంట్ల పద్మలు సంతకాలు చేసి బిల్లులు చెల్లించారు. అలా లెజెండ్‌ కంపెనీకి చెల్లించిన రూ.54 కోట్లను తిరిగి శ్రీహరి తన ఓమ్నీ ఫార్మా ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ మేరకు ఏసీబీ లెజెండ్‌ బ్యాంకు ఖాతా లావాదేవీల ప్రతులను సేకరించింది. శ్రీహరి లెజెండ్‌ కంపెనీ కోసం సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లు కూడా సంపాదించింది. అంతేకాకుండా ఓమ్నీ కంపెనీని హోమోక్యూ సరఫరా చేసిన డబ్ల్యూబీసీ కిట్ల బ్యాచ్‌ నంబర్లు, లెజెండ్‌ సరఫరా చేసిన బ్యాచ్‌ నంబర్లు ఒకటే కావడం గమనార్హం. దీంతో ఈ రెండు కంపెనీల వెనక ఉన్నది శ్రీహరిబాబే ఉన్నట్లు తేటతెల్లమైందని అధికారులు వ్యాఖ్యానించారు. ఇటీవల ఫార్మా కంపెనీ ఎండీ శ్రీహరి బాబుతో పాటు, హోమోక్యూ రీజినల్‌ మేనేజర్‌ టంకశాల వెంకటేశ్‌లు అరెస్టయిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు