అత్యాశకు పోయి.. అడ్డంగా దొరికాడు

19 Apr, 2015 01:47 IST|Sakshi

చిగురుమామిడి : యువత స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే యూనిట్ మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన మండల పరిషత్ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
 
 ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం... చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన షేక్ మోసిన్ మైనారిటీ కార్పొరేషన్ కింద రూ.లక్ష వ్యయమయ్యే టెంట్‌హౌస్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ యూనిట్ కింద రూ.50 వేలు రుణం కాగా, రూ.50 వేలు మైనారిటీ సంక్షేమశాఖ సబ్సిడీ అందిస్తుంది. మోసిన్‌కు రుణం ఇచ్చేందుకు ఇందుర్తిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కాన్సెంట్ ఇచ్చారు.
 
  యూనిట్ మంజూరు కావాలంటే బ్యాంకు మేనేజర్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసిన జే.ఐ షీట్‌ను జిల్లా మైనారిటీ కార్పొరేషన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ భూక్యా రాజేశ్‌నాయక్ మోసిన్‌ను రూ.5 వేలు డిమాండ్ చేశాడు.
 
 తాను నిరుపేదనని, అంత ఇచ్చుకోలేనని మోసిన్ బతిమిలాడినా వినిపించుకోలేదు. గత్యంతరం లేక ముందుగా రూ.3 వేలు, సబ్సిడీ మంజూరయ్యాక రూ.2 వేలు ఇచ్చేలా ఇప్పందం కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం రాజేశ్‌నాయక్ డిమాండ్‌ను మోసిన్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన సూచన మేరకు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు రాజేశ్‌కు శనివారం ఫోన్ చేయగా... తనకు కరీంనగర్‌లో మీటింగ్ ఉందని, రేకుర్తి సమీపంలో తన ఇల్లు ఉంటుందని, రేకుర్తి బస్టాండ్ వద్దకు రావాలని సూచించాడు.
 
  మీటింగ్ అయిపోయాక రాజేశ్  రేకుర్తి బస్టాండ్ వద్ద వేచి చూస్తున్న మోసిన్ వద్దకు వెళ్లాడు. అతడిని కొద్ది దూరం తీసుకెళ్లి రూ.3 వేలు తీసుకున్నాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ఏసీబీ అధికారులు రాజేశ్ వాహనంలో దాచిన డబ్బులను, రాజేశ్‌ను పట్టుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు. వ్యక్తిగత రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను డీఎస్పీ పరిశీలించారు. మోసిన్ దరఖాస్తును కూడా పరిశీలించారు. రాజేశ్‌నాయక్‌ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
 
 ‘కావాలనే ఇరికించారు’
 తనను ఇందులో కావాలనే ఇరికించారని భూక్యా రాజేశ్ ఆరోపించాడు. శనివారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల ఎదుట కంటతడిపెట్టాడు. ఓ విలేకరి(సాక్షి కాదు) తన బంధువుకు రుణం మంజూరు చేయలేదనే కుట్రతో కావాలనే డబ్బులు ఇచ్చి తనను పథకం ప్రకారమే పట్టించారని ఆరోపించారు. తనకు లంచం ఇవ్వబోగా వద్దని వారించానని, మోసిన్ బలవంతంగా ఇచ్చి తనను ఇరికించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
 

>
మరిన్ని వార్తలు