అంగట్లో అవినీతి!

23 Dec, 2014 23:36 IST|Sakshi
అంగట్లో అవినీతి!

షాబాద్: పశువుల సంతలో మేట వేసిన అవినీతి గుట్టును ఏసీబీ అధికారులు రట్టు చేశారు. సంతలో క్రయ విక్రయాలకు సంబంధించి వసూలైన డబ్బుల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మండలంలోని సర్దార్‌నగర్ సంతలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. సంత బుక్కులను, నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ప్రతి మంగళవారం జరిగే సర్దార్‌నగర్ సంతలో పశువుల అమ్మకం, కొనుగోళ్లపై నూటికి 2 శాతం పన్ను వసూలు చేయాలి.

ఆ డబ్బులను గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కంటితుడుపు చర్యగా రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేస్తున్నారు. మిగతా డబ్బును బినామీలు పంచుకుంటున్నారు. సర్దార్‌నగర్‌కు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి ఈ సంతను మధ్యవర్తిగా ఉండి నడిపిస్తున్నాడు.

కమీషన్ రెండు శాతం వసూలు చేయాల్సింది పోయి 5 నుంచి 10 శాతం వరకు వరకు వసూలు చేస్తున్నారు.  రైతులను, వ్యాపారులను నిలువునా ముంచుతున్నారు. ఈ సమాచారం ఏసీబీ అధికారులకు తెలిసింది. దీంతో మూడు వారాల క్రితం వారు సంతకు వచ్చి పరిశీలించారు. దీంతో మంగళవారం దాడులు జరిపారు.  సర్పంచ్, రామ్మోహన్ ఇళ్లలో సోదాలు చేశారు.

వారి ఇళ్లలో సంతకు సంబంధించి 50 బుక్కులు దొరికాయి. మొత్తం 220 రసీదులు, రూ.1.81 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఏస్పీ ప్రభాకర్‌తో పాటు సీఐలు వెంకట్‌రెడ్డి, లక్ష్మీ, సునీల్, గోవిందరెడ్డి బృందాలుగా ఏర్పడి పశువుల సంతలో జరుగుతున్న అవినీతిని పసిగట్టారు. అవకతవకలకు పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు. సర్దార్‌నగర్ పశువుల సంత 2007 నుంచి 2008 వరకు గ్రామ పంచాయతీయే వేలం వేసేది. వేలం పాడిన వ్యక్తి ఆ డబ్బులను వెంటనే గ్రామ పంచాయతీలో జమ చేసి ఏడాది పాటు సంత నడుపుకునేవారు.

2008లో హైకోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజులు ఈ సంతను మార్కెట్ కమిటీ నిర్వహించింది. గ్రామ పంచాయతీ మళ్లీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో తిరిగి పంచాయతీకే సంతను అప్పగించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత అవినీతి జరిగిందో రెండు మూడు రోజులు సోదాలు నిర్విహ ంచి అవినీతి పరులను కటకటాలకు పంపుతామని ఏసీబీ అధికారులు చెప్పారు. 2008 నుంచి 2014 వరకు ప్రతి అంగడిలో ఎంత ఆదాయం వచ్చిందో, ఎన్ని డబ్బులు బ్యాంకులో జమ చేశారో.. ప్రైవేట్ వ్యక్తులు ఎంత దోచుకున్నారో బ్యాంకు స్టేట్‌మెంట్ తీసుకోని వివరాలు వెల్లడిస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు