మేనేజర్‌ లంచావతారం

23 Nov, 2019 08:12 IST|Sakshi

ఏసీబీకి చిక్కిన బోడుప్పల్‌ నగర పాలక సంస్థ ఉద్యోగి

బిల్లుల మంజూరుకు కాంట్రాక్టర్‌ నుంచి డబ్బులు డిమాండ్‌

రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడిన రాజేందర్‌రెడ్డి

సాక్షి, బోడుప్పల్‌: బోడుప్పల్‌ నగర పాలక సంస్థలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ మేనేజర్‌ పి.రాజేందర్‌రెడ్డి కాంట్రాక్టర్‌ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్‌ జె.వెంకటేశ్‌గౌడ్‌ చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాను కమీషన్‌ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ సీటీ రేంజ్‌–2 డీఎస్‌పీ అచ్చేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పీర్జాదిగూడలో నివసించే పి.రాజేందర్‌రెడ్డి బోడుప్పల్‌ నగర పాలక సంస్థలో సీనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. బోడుప్పల్‌లో నివసించే జె.వెంకటేశ్‌గౌడ్‌ నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్‌. ఈయన ఇటీవల రూ.62 లక్షల విలువైన రోడ్డు పనులు చేశాడు. వాటిలో రూ.27 లక్షలకు బిల్లు చేశాడు. అయితే వాటిని మంజూరు చేయాలంటే తనకు 7శాతం కమీషన్‌ ఇవ్వాలని రాజేందర్‌రెడ్డి కాంట్రాక్టర్‌ను డిమాండ్‌ చేశాడు.

అంత ఇవ్వలేనని వేడుకున్నా వినలేదు. దీంతో కమీషన్‌ ఇస్తానని ఒప్పుకున్న వెంకటేశ్‌గౌడ్‌ 20 రోజుల క్రితం రూ.లక్ష అందజేశాడు. మళ్లీ ఈ నెల 19న రూ.20 వేలు ఇచ్చాడు. శుక్రవారం మరో రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఈలోపు వెంటేశ్‌గౌడ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.50 వేలు ఇస్తానని శుక్రవారం ఉదయం రాజేందర్‌రెడ్డికి ఫోన్‌ చేశాడు. ఆఫీసులో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్న ఆసిఫ్‌కు ఇవ్వమని రాజేందర్‌రెడ్డి చెప్పాడు. కాంట్రాక్టర్‌ వద్ద రూ.50 వేలు తీసుకున్న ఆసిఫ్‌ రాజేందర్‌రెడ్డికి ఇచ్చేందుకు ఆయన క్యాబిన్‌కు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు రాజేందర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన క్యాబిన్‌లో రెండు గంటలకు పైగా సోదాలు చేశారు. రాజేందర్‌రెడ్డి, ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అధికారుల్లో టెన్షన్‌.. బోడుప్పల్‌ నగర పాలక సంస్థపై ఏసీబీ అధికారులు దాడి చేయడంతో వివిధ శాఖల అధికారుల్లో భయం మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజనానికి సిద్ధమవుతుండగా ఈ దాడులు జరిగాయి. ఏసీబీ ఆఫీసర్లు రావడంతో అధికారులంతా అవాక్కయ్యారు. తొలుత ఏసీబీ అధికారులు మీసేవ కేంద్రంలో బిల్లులు చెల్లించే వారికి అనుమతినిచ్చారు. అధికారులతో పని ఉన్న వారిని అనుమతించలేదు. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో కమిషనర్‌ శంకర్, టీపీఓ శ్రీధర్‌రెడ్డి తప్ప మిగతా శాఖల అధికారులు అందుబాటులో లేరు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా