మాజీ సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

16 Jun, 2017 02:29 IST|Sakshi

- బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు
- తనిఖీల్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు


సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూకుంభ కోణం లో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్‌ అయిన మేడ్చల్‌ మాజీ సబ్‌ రిజిస్ట్రార్‌ తుమ్మలపల్లి వెంకట రమేశ్‌ చంద్రారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. రమేశ్‌ చంద్రారెడ్డి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు.

గురువారం ఉదయం 12 బృందా లుగా విడిపోయిన ఏసీబీ అధికారులు.. సిటీ రేంజ్‌ డీఎస్పీ సునీతారెడ్డి, అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో నాగోలు కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ కాలనీలో రమేశ్‌ చంద్రారెడ్డి  ఉంటున్న శ్రీజా అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారు. రమేశ్‌ చంద్రారెడ్డి తండ్రి జనార్దన్‌రెడ్డి, భార్య సునీ తలను కూడా విచారించారు. కోకాపేట రెవెన్యూ పరిధిలోని రాజపుష్ప అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రమేశ్‌ చంద్రారెడ్డి మరదలు అనిత నివాసంలోనూ సోదాలు చేశారు.

రూ.10 కోట్ల ఆస్తుల గుర్తింపు..
ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో రమేశ్‌ చంద్రా రెడ్డికి చెందిన రూ.10 కోట్ల విలువైన స్థిరచరాస్తులు గుర్తించారు. కొత్తపేటలో రూ.6.6 లక్షలు, నాగో ల్‌లో రూ.60 లక్షల విలువైన ఫ్లాట్లు, భువ నగిరి సమీపంలోని రాయ్‌గిరిలో రూ.24.25 లక్షల విలువైన రెండెకరాల భూమి, కేశారంలో రూ.14.5 లక్షల విలువైన 2 ఎకరాల 36 గుంటల భూమి, రూ.15.5 లక్షల విలువైన 5 ఎకరాల 4 గుంటల మరో భూమి, కర్మన్‌ఘాట్‌లో రూ.46 లక్షల విలువైన ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

చంద్రారెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లు, ఇంట్లో రూ.65 లక్షల విలువైన మూడున్నర కేజీల బంగారం గుర్తించారు. వీటికితోడు రూ.1.07 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్, రూ.30 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.3.5 లక్షల విలువైన గృహోప కరణాలు, రూ.1.2 లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

రైటర్‌ నివాసంలోనూ తనిఖీలు
ఎల్‌బీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. చంపాపేట సమీపంలోని వైశా లినగర్‌లో నివసిస్తున్న డి.నర్సింహారావు నివాసం లోనూ గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.  రమేశ్‌ చంద్రారెడ్డి బినామీగా భావిస్తున్న ఉప్పల్‌కు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ మేకల వెంక ట్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేసి.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు