ఈ పోలీసుకి ఏమైంది?

6 Feb, 2019 10:37 IST|Sakshi
వేటు పడిన పోలీస్‌ అధికారులు బుచ్చియ్య, శ్రీనివాసులు, గంగారామ్‌

గత ఏడాది ఏసీబీ దాడుల కలకలం

ఈసారి ఆది నుంచి వివాదాలమయం

సర్దుకోలేకపోతున్న జిల్లాల అధికారులు

ఎన్నికల ఎఫెక్ట్‌తో సిటీలో మారిన సీన్‌

తాజాగా ఇన్‌స్పెక్టర్, సీఐపై కొత్వాల్‌ వేటు

పాత అధికారులను వెనక్కి

తీసుకురావడం ఉత్తమమనే యోచనలో ఉన్నతాధికారులు

సాక్షి,సిటీబ్యూరో: గతేడాది వరుస ఏసీబీ ట్రాప్స్‌.. ఈ ఏడాది వరుసపెట్టి వివాదాలు.. వెరసి పోలీసు విభాగానికి ఏమైందనే సందేహం కలుగుతోంది. అనుచిత ప్రవర్తన, ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ బుచ్చియ్యపై వేటు పడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరామ్‌ హత్య కేసులో మృతదేహం తరలింపునకు సలహా ఇచ్చానే ఆరోపణ ఎదుర్కొంటున్న నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులును సోమవారం లూప్‌లైన్‌లోకి బదిలీ చేశారు. ఉల్లంఘనుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి ఇచ్చే విషయంలో గోల్‌మాల్‌కు పాల్పడ్డారనే ఆరోపణపై సైఫాబాద్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగారామ్‌తో పాటు ఓ ఎస్సైను సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌కు ఎటాచ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఇలాంటి సంఘటనలకు ప్రధాన కారణం ‘ఎలక్షన్‌ ఎఫెక్ట్‌’ అని వినిపిస్తోంది.

కమిషనరేట్‌కు జాతీయ గుర్తింపు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ను రోల్‌మోడల్‌గా తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారులు విప్లవాత్మకమైన సంస్కరణలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడంతో పాటు సిబ్బంది, అధికారుల్లో మార్పునకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా అవినీతికి గణనీయంగా అడ్డుకట్ట పడడి, వారి ప్రవర్తన ప్రజల మన్నన పొందేలా మార్చారు. ఈ చర్యలన్నీ వెరసి నగర పోలీసు కమిషనరేట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చాయి. ఇక్కడ అమలవుతున్న విధానాలకు తగ్గట్టు పనిచేస్తున్న అధికారులను మార్చడంలో ఉన్నతాధికారులు సఫలీకృతులయ్యారు. వెరసి దాదాపు నాలుగున్నరేళ్ల పాటు సిటీలో పోలీసింగ్‌ సజావుగా సాగిపోయింది. చెదురుమదురు ఘటనల మినహా పోలీసింగ్‌కు మచ్చ తెచ్చే సంచలనాత్మక ఘటనలు ఏమీ లేవు. 

ఎన్నికల సందర్భంలో నిబంధనలతో..
గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈసీ తీసుకు వచ్చిన నిబంధనలు సిటీలో భారీ బదిలీలకు కారణమయ్యాయి. ఇన్‌స్పెక్టర్లు రెవెన్యూ జిల్లాలో గరిష్టంగా మూడేళ్లు, ఎస్సైలు ఓ నియోజకవర్గంలో గరిష్టంగా ఐదేళ్లకు మించి పనిచేస్తే బదిలీ తప్పలేదు. రాజధానిలో మొత్తం మూడు కమిషనరేట్లు ఉన్నాయి. వీటిలో ఎన్నికల బదిలీల ఎఫెక్ట్‌ సిటీపైనే భారీగా పడింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లా పరిధిలోనే విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు వేరే కమిషనరేట్‌/జిల్లాకు బదిలీ కావడం అనివార్యమైంది. దీనికితోడు అదే సమయంలో సిటీ నుంచి డీఎస్పీలుగా (ఏసీపీ) పదోన్నతి పొందిన వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇలా ప్రమోషన్‌ వచ్చిన వారికి కాలపరిమితి నుంచి మినహాయింపు ఉంటుందని భావించినా అది సాధ్యం కాలేదు.

సిటీ పైనే భారీ ప్రభావం..
నగరం చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు ఎన్నికల బదిలీల విషయంలో సేఫ్‌ జోన్‌లోకి చేరిపోయాయి. అక్కడా బదిలీలు అనివార్యమే అయినప్పటికీ కమిషనరేట్స్‌ పరిధిలో అంతర్గతంగా చేసుకుంటే సరిపోయింది. సైబరాబాద్‌లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు, రాచకొండలో రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఒక కమిషనరేట్‌లో రెండు, మరో దాంట్లో మూడు రెవెన్యూ జిల్లాలు ఉన్నట్లే లెక్క. వీటి ప్రకారం ఓ జిల్లాలో ఉన్న ఠాణాల్లో పనిచేస్తూ మూడేళ్లు పూర్తయిన వారిలో కొందరిని అదే కమిషనరేట్‌లోని మరో రెవెన్యూ జిల్లాకు పంపే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ రెండు కమిషనరేట్లపై ఎన్నికల బదిలీల భారం భారీగా లేదు. అయితే, హైదరాబాద్‌ కమిషనరేట్‌ మొత్తం ఒకే రెవెన్యూ జిల్లాలో ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న వారిని అనివార్యంగా బయటకు బదిలీ చేసి జిల్లాల్లోని వారిని తీసుకురావాల్సి వచ్చింది. ఎస్సై స్థాయి అధికారుల్లో సిటీ నుంచి బయటకు–అక్కడ నుంచి సిటీకి వంటి మార్పులు లేవు. అయితే నగరంలో స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్లుగా(ఎస్‌హెచ్‌ఓ) వ్యవహరించే ఇన్‌స్పెక్టర్లే అత్యంత కీలకం. 

ఇక్కడి ‘పద్ధతులు’ వారికి పట్టక..
గడిచిన నాలుగున్నరేళ్లు పరిణామాలను పరిశీలిస్తే నగర పోలీసు విభాగంలో పోలీసింగ్‌కు ప్రత్యేక పద్ధతులు, జవాబుదారీతనం ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఈ తరహా వ్యవస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో అక్కడి ‘విధానాలు’ యథావిధిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ‘అంశాలకు’ అలవాటుపడిన అధికారులు ఎన్నికల నిబంధనల నేపథ్యంలో అనివార్య పరిస్థితులతో సిటీలోకి వచ్చారు. ఇక్కడ పోస్టింగ్‌ తీసుకున్నప్పటికీ విధానాలకు ఆకళింపు చేసుకోలేక, అక్కడ ఉన్న ‘సౌకర్యాలు’ వదులుకోలేక తీవ్రస్థాయిలో ‘నలిగిపోతున్నారు’. ఈ కారణంగానే అవకాశం దొరికినప్పుడల్లా ‘స్వలాభాల’ కోసం అర్రులు చాస్తున్నారు. వెరసి వరుసపెట్టి ఏసీబీకి పట్టుబడడం, తీవ్రస్థాయిలో వివాదాస్పదులుగా మారడం పరిపాటిగా మారింది. సిటీలో కనీసం ఏసీపీ స్థాయి అధికారులైనా పాతవారు ఉంటే పరిస్థితులు అదుపులో ఉండేవి. వారూ కొత్త వారే కావడంతో హద్దూ అదుపు లేకుండా పోతోంది. 

వారినివెనక్కి తెస్తేనే పరిస్థితుల్లో మార్పు
పోలీసు విభాగంలో వెలుగులోకి వస్తున్న వివాదాలకు పుల్‌స్టాప్‌ పెట్టాలంటే భారీ స్థాయిలో బదిలీలు అనివార్యమని తెలుస్తోంది. ప్రస్తుతం సిటీలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారుల్లో అనేకమంది ఎప్పుడు ‘పారిపోదామా’ అనే ఉద్దేశంతోనే తప్పనిసరై తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఉన్నతాధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. నిపుణులతో క్లాసులు తీసుకుని, జవాబుదారీతనం పెంచడానికి కృషి చేస్తున్నా సత్ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో నానాటికీ వివాదాస్పదం అవుతున్న పోలీసింగ్‌లో మార్పు రావాలంటే సిటీకి చెందిన పాత అధికారులను మళ్లీ వెనుక్కు తీసుకురావడం ఉత్తమం అనే భావన ఉంది. అయితే, పార్లమెంట్‌ ఎన్నికల పూర్తయ్యే వరకు ఇది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈలోగా సిటీ కమిషనరేట్‌లో ‘నిర్ణీత గడువు’ పూర్తి చేసుకున్న మరికొందరూ బయటకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు ‘ఫేవరేట్‌ సీట్‌’గా ఉన్న సిటీలో పోస్టింగ్‌ ప్రస్తుతం ‘హాట్‌ సీట్‌’గా మారిందని వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు