చిల్లర దేవుళ్లకు.. వెయ్యి కోట్ల ‘మామూళ్లు’

4 Dec, 2017 03:02 IST|Sakshi

ఉచితంగా అందాల్సిన సేవలకు వసూలవుతున్న లంచాల లెక్క ఇది

డిమాండ్‌ లంచాలు అదనం

ప్రధాన విభాగాల్లో లంచాలపై ఏసీబీ, విజిలెన్స్‌ రహస్య సర్వే

జనంలో ‘మామూళ్లు’ ఇవ్వక తప్పదుకదా అన్న భావన

చిన్న చిన్న ‘చిల్లర’చదివింపులే.. వందల కోట్లకు చేరుతున్న వైనం

రెవెన్యూ టాప్‌.. తర్వాతి స్థానాల్లో రవాణా, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, పోలీసులు

అన్ని విభాగాల్లో లెక్క గడితే వేల కోట్లు దాటే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలకు నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లో ఎన్నో రకాల సేవలు అవసరం. అవన్నీ జనానికి ఉచితంగానే అందాలి. కానీ ఇలా మామూలుగా అందాల్సిన సేవలు ప్రభుత్వ కార్యాలయాల్లో ‘మామూళ్లు’గా మారాయి. ప్రతి సేవకూ తృణమో, పణమో సమర్పించక తప్పదు కదా అన్న భావన కూడా స్థిరపడిపోయింది. రాష్ట్రంలో ఏటా ఇలాంటి చిన్న చిన్న ‘చిల్లర’లంచాల మొత్తమే ఏకంగా రూ. 1,000 కోట్లు దాటిపోతోంది. ప్రజలకు తరచూ ఏదో ఒక పనిపడే ప్రభుత్వ విభాగాల్లో ఈ జాడ్యం ఎక్కువగా ఉంటోంది. ఇలా ఒక్కో శాఖ పరిధిలోని అధికారులు, సిబ్బంది జేబుల్లోకి ఏటా వేల కోట్ల రూపాయలు చేరుతున్నట్లు ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాల రహస్య అధ్యయనంలోనే వెల్లడైంది. ఇక అవసరమైన పెద్ద పనుల కోసం, అక్రమాలు, అవకతవకలకు సహకరిస్తూ అధికారులు, సిబ్బంది డిమాండ్‌ చేసే ‘ముడుపులు’వేరే. అవన్నీ లెక్కగడితే వేల కోట్ల రూపాయలకు చేరుతాయని అంచనా.

‘చిల్లర’లంచాల్లో రెవెన్యూ టాప్‌
అన్ని ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే.. రెవెన్యూ విభాగం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటుంది. అదే క్రమంలో చిన్న చిన్న లంచాల స్వీకరణలోనూ టాప్‌లో నిలుస్తోంది. స్థానిక, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి భూముల లెక్కలు సరిచేసే వరకు చాలా రకాల సేవలు అందించే రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందికి చదివింపులు భారీగానే ఉంటున్నట్టు విజిలెన్స్‌ అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో కొత్త మండలాలతో కలిపి మొత్తంగా 584 మండలాలు ఉన్నాయి. వీటిలో 510 కార్యాలయాలు నిత్యం బిజీగా ఉంటాయి. వీటిలో పనుల కోసం వచ్చే జనం.. రోజూ సగటున సుమారు రూ.35 వేల వరకు సమర్పించుకుంటున్నారు. ఈ లెక్కన మండల రెవెన్యూ కార్యాలయాలన్నింటిలో కలిపి రోజుకు రూ.1.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 645 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నట్లు విజిలెన్స్, ఏసీబీల అధ్యయనంలో వెల్లడైంది.

కలెక్టరేట్లలోనూ..
రెవెన్యూ శాఖ పరిధిలో 31 జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల్లోనూ ‘మామూళ్లు’కోట్లకు చేరిపోయాయి. ఒక్కో జిల్లా కలెక్టరేట్‌లో సగటున రోజూ రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు చదివింపులు జరుగుతున్నాయని.. ఇలా ఏటా రూ.273 కోట్ల మేర లంచాలు వసూలవుతున్నాయని ఏసీబీ ఇటీవల జరిపిన రహస్య అధ్యయనంలో గుర్తించింది.

రవాణా శాఖలో ఏటా రూ.220 కోట్లు
వాహనాల రిజిస్ట్రేషన్లు సహా పలు రకాల సేవలు అందించే రవాణా శాఖలో లంచాల పర్వం ఎక్కువగానే ఉంది. ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని ఉండకుండా అప్పటికప్పుడే పని పూర్తికావాలంటూ వాహనదారులు మామూళ్లు చెల్లిస్తున్నారని.. ఇలా రోజూ సుమారు రూ. 60 లక్షల మేర లంచంగా సమర్పించుకుంటున్నారని ఏసీబీ, విజిలెన్స్‌ అధ్యయనంలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ఆర్టీఏ, యూనిట్‌ ఆఫీసులలో ఒక్కో యూనిట్‌లో రోజుకు రూ.లక్ష మేరకు చిన్న చిన్న లంచాలు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు అంచనా. ఇలా ముడుపుల సొమ్ము ఏటా రూ.220 కోట్ల వరకు చేరుతోంది.

రిజిస్ట్రేషన్‌లో ‘మామూలే’!
స్థలం అమ్మినా, కొన్నా, బదిలీ చేసినా.. ఇలా 14 రకాల సేవలు అందించే రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ విభాగంలోనూ చిన్న చిన్న ముడుపులు మామూలైపోయాయి. రాష్ట్రంలో 22 జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, 195 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లోని 22 కార్యాలయాల్లో ఒక్కో దానిలో నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు (మొత్తంగా 66 లక్షలు).. 195 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒక్కోదానిలో నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ( మొత్తంగా రూ.1.56 కోట్లు) చిల్లర లంచాలు జమవుతున్నాయి. మొత్తంగా జిల్లా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కలిపి నెలకు సుమారు రూ.2.2 కోట్ల చొప్పున ఏటా రూ.26 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోందని ఏసీబీ, విజిలెన్స్‌ సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది.

ఎక్సైజ్‌లో నెలకు రూ.15 కోట్లు..
మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాలకు వేల కోట్ల రూపాయలు వచ్చిచేరుతున్నట్టే.. అధికారులు, సిబ్బంది జేబుల్లోకి కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు చేసిన అధ్యయనం మేరకు.. ప్రతీ నెల జిల్లాల వారీగా రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా చిన్న చిన్న చదివింపులు ఉంటున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల రూ. 15 కోట్ల చొప్పున ఏడాదికి రూ.180 కోట్ల మేర ‘మామూళ్లు’అందుతున్నాయి.

జీఎస్టీతో తగ్గిన ‘వాణిజ్య’జోరు
వాణిజ్య పన్నుల శాఖలో పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. జీఎస్టీ రాకముందు వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారుల నుంచి రోజు వారీ చెల్లింపులు భారీగానే ఉండేవి. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత నెల వారీగా మాత్రమే చదివింపులు వస్తున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలోని 12 డివిజన్లలో ప్రతీ నెలా రూ.65 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ‘చిన్న మొత్తాలు’వస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇలా ఏటా రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోంది.

వీటిలో నెలవారీ వసూళ్లు..!
సమయం, సందర్భాన్ని బట్టి ప్రజలు ఉపయోగించుకునే విభాగాల్లో.. రోజు లెక్కన కాకుండా నెలవారీగా ‘చదివింపులు’జరుగుతున్నాయి. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్‌ ట్యాక్స్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాలకు నెలవారీగా చిన్న లంచాలు అందుతున్నాయి. వీటిల్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా... జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ శాఖలు అనుమతులను బట్టి మూడో స్థానంలో ఉన్నాయి. తూనికలు కొలతలు, పోలీసుశాఖ నాలుగో స్థానంలో ఉన్నాయి.

సందర్భం వచ్చినప్పుడల్లా ‘చదివింపులు’
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ విభాగాల్లో అనుమతుల అవసరాలు, సందర్భాన్ని బట్టి ‘చిల్లర లంచం’సమర్పణలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో కలిపి ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిన్న మొత్తాలు’అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నాయి.
పోలీసు శాఖలోనూ జిల్లాల్లో నెలవారీ మామూళ్ల లెక్క కోట్లు దాటుతోంది. కమిషనరేట్లు, జిల్లా పోలీస్‌ విభాగాల పరిధిలో 740 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. పట్టణ ప్రాంత పోలీస్‌స్టేషన్లలో రూ.5 లక్షల వరకు, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు ఏసీబీ అధ్యయనంలో గుర్తించింది. ఈ లెక్కన మొత్తంగా ఏటా రూ.180 కోట్ల మేర చిల్లర చెల్లింపులు ఉంటున్నట్టు తేల్చింది.
తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలిలకు కేసుల వారీగా చెల్లింపులు ఉంటున్నట్టు ఏసీబీ అధ్యయనంలో తేల్చింది. ఈ రెండు విభాగాల్లో ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిల్లర’చెల్లింపులు ఉంటున్నట్టు అంచనా వేసింది.

మరిన్ని వార్తలు