మాట వినకుంటే గుర్తింపు రద్దు!

2 Sep, 2015 01:13 IST|Sakshi
మాట వినకుంటే గుర్తింపు రద్దు!

ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సర్కారు హెచ్చరిక
‘ఏడాది గ్యారంటీ’కే అంగీకరించాలని పునరుద్ఘాటన
ఇప్పటికైనా దిగి రావాలని సూచన

 
హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల తీరుపై రాష్ట్ర సర్కారు సీరియస్ అయింది. మాట వినకుంటే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. బీ కేటగిరీ (యాజమాన్య కోటా)లోని 35 శాతం సీట్లకు కౌన్సెలింగ్ జరిగిన తర్వాత ‘నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ’ చూపిస్తేనే ఎంబీబీఎస్‌లో చేర్చుకుంటామని... లేకుంటే సీటు రద్దవుతుందన్న ప్రైవేటు యాజమాన్యాల వైఖరితో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ‘ఏడాదికే బ్యాంకు’ గ్యారంటీ తీసుకోవాలని ఆదేశిస్తూ సర్కారు జీవో జారీచేసినా, దీనిపై చాలా సార్లు విజ్ఞప్తి చేసినా యాజమాన్యాలు బేఖాతరు చేశాయి. ఆ జీవోతో తమకు సంబంధం లేదంటూ తేలికగా తీసిపారేశాయి. దీంతో యాజమాన్యాలపై సర్కారు మండిపడినట్లు తెలిసింది. ‘వారం గడువు ఇవ్వాల్సిందే.. ఏడాది గ్యారంటీకి పరిమితం కావాల్సిందే’నని  స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాలను ధిక్కరిస్తే ఆయా కాలేజీలకు ముందుగా నోటీసులు జారీచేస్తామని, అప్పటికీ దారికి రాకుంటే గుర్తింపు రద్దు కోరుతూ ఎంసీఐకి విన్నవిస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. ఈ హెచ్చరికతో ప్రైవేటు వైద్య కాలేజీల యాజమాన్యాలు కంగుతిన్నాయి. అయితే ప్రభుత్వ తాజా హెచ్చరికతో ఎన్ని కళాశాలలు తమ వైఖరి మార్చుకుంటాయో వేచిచూడాల్సిందే.

సగానికిపైగా ‘గ్యారెంటీ’..
 ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు డబ్బే పరమావధిగా వ్యవహరించాయన్న విమర్శలున్నాయి. అలాగే ఆ కాలేజీలను నియంత్రించలేని ప్రభుత్వ తీరుపైనా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపైనా నమ్మకం కోల్పోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... సీటు విషయంలో రిస్క్ తీసుకోవడం సమంజసం కాదని భావించారు. ఇలాంటి అనేకమంది ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి... నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపారు. మొత్తం 505 ఎంబీబీఎస్ సీట్లుంటే ఇప్పటివరకు సగానికిపైగా సీట్లకు సంబంధించిన విద్యార్థులు నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపినట్లు తెలిసింది. ‘విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో వ్యతిరేకత రాకుండా ఉండేలా ప్రభుత్వం ఏదో ఒక జీవో జారీచేసింది. కానీ దాని అమలుకు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి, ప్రైవేటు యాజమాన్యాలకు మధ్య అవగాహనలో భాగంగానే ఈ నాటకాలు ఆడుతున్నట్లు అనిపిస్తోంది. అందుకే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపిస్తున్నాం..’ అని వరంగల్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి తండ్రి పేర్కొనడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు