హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

26 Jun, 2019 12:23 IST|Sakshi
నిందితుల అరెస్ట్‌ చూపుతున్న ఏసీపీ నర్సింగ్‌రావు, సీఐ శ్రీనివాస్‌జీ

 భూమి ఇవ్వలేదనే కక్షతో మామను హత్య చేసిన అల్లుడు

 వివరాలు  వెల్లడించిన  ఏసీపీ నర్సింగ్‌రావు

సాక్షి,ధర్మసాగర్‌: ఈ నెల 9న వేలేరు శివారులో జరిగిన దారుణహత్య కేసును పోలీసులు చేధించారు. మంగళవారం ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించి, ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చూపారు. కాజీపేట ఏసీపీ నర్సింగ్‌రావు కథనం ప్రకారం.. ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి పెద్దరబోయిన రాజకొమురయ్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు స్వప్న ఇదే గ్రామానికి చెందిన మేడబోయిన మహేందర్‌ ను 13 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.

ఈ క్రమంలోనే వారి ఇరువురి మధ్య గొడవులు జరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా కేసులు సైతం నమోదై ఉన్నాయి. ఈ క్రమంలోనే 15 నెలల క్రితం రాజకొమురయ్య భార్య మృతి చెందటంతో, తిరిగి వీరి మధ్య సంబంధాలు మదలయ్యాయి. దీంతో పెద్ద కూతురుకు తన వ్యవసాయ భూమిలో ఒక ఎకరం ఇస్తానని మాట ఇచ్చారు. ఇదే విషయంపై మృతుడి భార్య సంవత్సరికం సందర్భంగా మామ రాజకొమురయ్యను, అల్లుడైన మహేందర్‌ నిదీశాడు. దీంతో అల్లుడిపై ఆగ్రహంతో నేను మరో వివాహం చేసుకుంటానని, ఎవరికి తన ఆస్తిలో నుంచి వాటా ఇవ్వనని ఘటుగా సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలో తన మామ బతికి ఉంటే భూమి దక్కదని తలచిన అతడి ఎలాగైన హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. ఇదే విషయమై గ్రామానికి చెందిన తన స్నేహితులైన ముప్పిడి నాగరాజు, పుట్ట వేణులకు తెలిపి, తన మామ హత్యకు సహరిస్తే చెరొక లక్ష రూపాయలు ఇస్తానని వారి ఒప్పించాడు. అనంతరం సమయం కోసం వేచి చూసి ఈ నెల 8వ తేదీ న హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు.

మరుసటి రోజున తన చిన్న కూతురు బంధువుల ఇంటికి సైదాపూర్‌ మండలం అగ్రహా రం గ్రామానికి ఓ ఫంక్షన్‌ వెళ్లి  తిరిగి టీవీఎస్‌ మోపెడ్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే ఫంక్షన్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న మహేందర్, నాగరాజు, వేణులు ముల్కనూరు నుంచి అతడిని మరొక బైక్‌పై వెంబడించారు. హవల్థారుపల్లి, ఎర్రబెల్లి గ్రామాల మధ్యన మనుషుల సంచారం లేకపోవటంతో వారి బైక్‌తో మృతుడు ప్రయాణిస్తున్న మోపెడ్‌ను ఢీ కొట్టి అతడు కింద పడటంతో వెంట తెచ్చుకున్న వేట కొడవలి, దుడ్డు కర్రలతో విషక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.

కాగా మృతుడి చిన్న కూతురు గూళ్ల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ధర్మసాగర్‌ ఇన్‌ఛార్జి ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, వేలేరు ఎస్సై ఈ.వీరభద్రరావులు ఆధారాలకు సేకరించి హత్య కేసును పలు కోణాల్లో విచారించి హత్య చేసిన నిందితులు ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేట కొడవలి, దుడ్డు కర్రలను స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా  సీఐ శ్రీనివాస్‌జీ, వేలేరు ఎస్సై ఈ. వీరభద్రరావులను ఏసీపీ నర్సింగ్‌రావు అభినందించారు.  కార్యక్రమంలో ఎస్సై వి.విజయ్‌రాంకుమార్, ఎఎస్సై ఉమాకాంత్, హెచ్‌సీలు సహదేవ్, కాంతరావు, పీసీలు రవిరాజ్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు