హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

14 Oct, 2017 15:30 IST|Sakshi

నకిరేకల్‌ : హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాలిగౌరారం సీఐ విశ్వప్రసాద్‌ కేసు విరవాలు వెల్లడించారు. కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల సైదులుతో నకిరేకల్‌ మండలం తాటికల్‌ గ్రామశివారులోని ఆర్లగడ్డగూడేనికి చెందిన కలమ్మతో 14సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సైదులుకు కలమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైదులు తాగుడుకు బానిసై పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని తిరుగుతుండడంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

 ఆరేళ్ల క్రితం సైదులు భార్య కలమ్మ తన  ఇద్దరి పిల్లలతో కలిసి తల్లిదండ్రుల గ్రామమైన ఆర్లగడ్డగూడెంలో జీవనం సాగిస్తోంది.  తన భార్యతో మాట్లాడి కాపురానికి వచ్చేటట్లు చేయాలని కలమ్మ మేనమామ అయిన తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల రామస్వామితో పలుమార్లు విన్నవించుకున్నాడు. సదరు రామస్వామి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

తన భార్యకాపురానికి రాకపోవడానికి రామస్వామి కారణమని భా వించిన  సైదులు అతనిపై కక్ష పెంచుకున్నా డు. రామస్వామిని హ త్య చేయాలని పథకం ప్రకారం ఈనెల 10వ తేదీ ఉదయం 10ః30గంటలకు సైదులు తన చిన్నమ్మ కొడుకైన కట్టంగూర్‌మండలం నారాగూడేనికి చెందిన నామ కోటయ్యతో కలిసి తుంగతుర్తి గ్రామంలో మేరుగు మల్ల నర్సమ్మ ఇంటిముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రామస్వామిపై కత్తులతో దాడి చేసి హతమార్చి పరారయ్యారు. ఈనెల 12న సదరు సైదులు, కోటయ్యలు బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌వద్ద రాత్రి 8గంటల సమయంలో వారిని పట్టుకున్నామని సీఐ విశ్వప్రసాద్‌ వివరించారు. నిందితులను నకిరేకల్‌ మున్సిఫ్‌ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. సమావేశంలో కేతేపల్లి ఎస్‌ఐ రజనీకర్, సిబ్బంది లింగయ్య, శ్రీరాములు ఉన్నారు.

మరిన్ని వార్తలు