భయం గుప్పిట్లో అచ్చంపేట

2 Jun, 2020 13:20 IST|Sakshi
మధురానగర్‌కాలనీలో అధికారులతో మాట్లాడుతున్న డీఎస్పీ నర్సింహులు

కరోనా బాధితుడి కుటుంబంలోని ఆరుగురికి నెగెటివ్‌

అచ్చంపేట: కరోనా వైరస్‌ వ్యాధితో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం పట్టణంలోని మధురానగర్‌కాలనీలో పాజిటివ్‌ కేసు నమోదు కావటంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌గా గుర్తించారు. పాజిటివ్‌ వచ్చిన యువకుడి కుటుంబంలోని ఆరుగురిని నాగర్‌కర్నూల్‌ ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించి రక్తనమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. నెగెటివ్‌ ఫలితాలు వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తండ్రిని ఐసోలేషన్‌కు తరలించారు. పాజిటివ్‌ వచ్చిన యువకుడి కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు, పరిచయస్తులు సుమారు 41 మంది హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటికే నమోదైన చారకొండ మండలం నారాయణపురం, వంగూరు మండలం కొండారెడ్డిపల్లి, ఉప్పునుంతల, అచ్చంపేట నాలుగు కేసుల్లో ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తులకు ఎవరికి పాజిటివ్‌ రాకపోవటంతో ఈ ప్రాంతంలో వ్యాధి విజృంభనకు కొంత బ్రేకు పడినట్లయింది. మున్సిపల్‌ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతూ హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.

ఇంటింటి సర్వే..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సురేశ్, సుగుణ అన్నారు. సోమవారం పట్టణంలోని మధురానగర్‌కాలనీలో వైద్యసిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, మధుమేహం, బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నాయా.. అని ఆరా తీశారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కంటైన్మెంట్‌ ప్రాంతంలో 14 రోజుల పాటు ఇంటింటి సర్వే చేపడుతామని చెప్పారు. సర్వేలో ఉప మలేరియా అధికారి అశోక్‌ప్రసాద్, హెల్త్‌ అసిస్టెంట్లు హన్మంతు, ఇందిర, బిందు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 

స్వీయ నియంత్రణ తప్పనిసరి
ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని.. ఎవరికి వారు ఇళ్లకే పరిమివ్వాలని అచ్చంపేట డీఎస్పీ కోనం నర్సింహులు అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని మధురానగర్‌కాలనీ కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీస్‌శాఖలతో మాట్లాడారు. స్వీయ నియంత్రణ తప్పనిసరి అని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం నిరంతరం చేయాలన్నారు. వృద్ధులు, పిల్లలు బయటకు రాకుండా చూసుకోవాలని, కాలనీవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలనీని దిగ్బంధం చేయడమంటే మిమల్ని ఇబ్బందులుకు గురి చేయడం కాదని.. ఏమైనా సమస్యలుంటే ఫోన్‌ ద్వారా అధికారులకు తెలియజేస్తే పరిష్కరిస్తారని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోం కార్వంటైన్‌ చేసిన ఇళ్ల వారు బయటికి రావొద్దని, ఏమైనా అవసరాలుంటే అధికారులకు చెబితే తీరుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్, ఏఎస్‌ఐ అంజయ్య, వైద్యులు సురేశ్, సుగుణ, హెల్త్‌ అసిస్టెంట్‌ హన్మంతు, ఉప మలేరియా అధికారి అశోక్‌ప్రసాద్‌  తదితరులు పాల్గొన్నారు.

ఐదుగురు హోం క్వారంటైన్‌లో..
భూత్పూర్‌ (దేవరకద్ర): అమిస్తాపూర్‌లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులను సోమవారం స్థానిక వైద్యాధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. హైదరాబాద్‌ నుంచి అమిస్తాపూర్‌కు వచ్చిన అతడి భార్య, కుమారుడు, కోడలుతో పాటు ఇద్దరు మనువరాండ్లను 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సీహెచ్‌వో రామయ్య, వైద్యసిబ్బంది సూచించారు. 5వ వార్డును కంటైన్మెంట్‌ జోన్‌గా మార్చటంతో ఆశ, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు ఇల్లిల్లూ తిరిగి ఆరోగ్య పరిస్థితి, ఆధార్, ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. రహదారి వెంట మాత్రమే బారికేడ్లు ఏర్పాటుచేయటం, వెనుక వైపు లేకపోవటంతో వీధుల్లో ప్రజలు, చిన్నారులు, వృద్ధుల తిరుగుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు