హీరా గ్రూప్‌ ఆస్తుల స్వాధీనానికి చర్యలు 

26 Dec, 2018 01:57 IST|Sakshi

ఇప్పటికే రూ.1,000 కోట్ల విలువైన వాటిని గుర్తించిన సీసీఎస్‌ పోలీసులు 

అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ 

ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌ సిటీ రాక మరింత ఆలస్యం 

సాక్షి, హైదరాబాద్‌: స్కీముల పేరుతో స్కాములకు పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కేసులో బాధితులకు ఊరట కలిగించే అంశాలపై నగర నేర పరిశోధనా విభాగం(సీసీఎస్‌) పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగా ఆ సంస్థతోపాటు నిందితుల పేర్లతో ఉన్న ఆస్తుల్ని అటాచ్‌ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన దాదాపు రూ.1,000 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికిగాను అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోపక్క మహారాష్ట్ర జైల్లో ఉన్న ఆ గ్రూప్‌ సీఈవో నౌహీరా షేక్‌ను సిటీకి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో నౌహీరాతోపాటు ఆ సంస్థ పేరిట ఉన్న ఆస్తుల్ని సీసీఎస్‌ పోలీసులు గుర్తించి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.

వివిధ రకాలైన వ్యాపారాలు చేస్తున్నానని, ఆయా వ్యాపారాల్లో 90 శాతం లాభాలు వస్తున్నాయని, అందులో పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 36 శాతం చొప్పున లాభాలు ఇస్తానని నమ్మించిన నౌహీరా షేక్‌ కొన్నేళ్లుగా భారీ డిపాజిట్లు సేకరించింది. దీనిపై కేసులు నమోదు కావడంతో హీరా గ్రూప్‌ ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ వనరులపై సీసీఎస్‌ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వీరికి అసలు వ్యాపారాలే లేవని, డిపాజిట్లనే రొటేషన్‌ చేస్తూ, గొలుసుకట్టు విధానంలో వ్యాపారం చేస్తున్నారని పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. ఎంతమంది డిపాజిట్‌దారులున్నారు, ఎంత మేర డిపాజిట్లు సేకరించారనే వివరాలను కూడా నిర్వాహకులు ఇవ్వకపోడంతో హైదరాబాద్‌ పోలీసులు అతికష్టమ్మీద వాటిని సేకరించారు. హీరా గ్రూపునకు సంబంధించిన ఆర్థిక అక్రమాల్లో బాధితులు తీవ్రస్థాయిలో నష్టపోయారు.  

క్రయవిక్రయాలపై సబ్‌రిజిస్ట్రార్లకు లేఖలు 
హీరా గ్రూపు కేసులో సీసీఎస్‌ పోలీసులు డిపాజిట్‌దారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్లను జోడించారు. దీంతో ఆస్తుల స్వాధీనానికి ఆస్కా రం ఏర్పడింది. ఇప్పటికే పోలీసులు ఆ సంస్థకు చెందిన ఆస్తుల్ని గుర్తించి, సీజ్‌ చేస్తూ క్రమవిక్రయాలు నిషేధించాల్సిందిగా సబ్‌–రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. ఇలా నమోదైన కేసుల్లో నిందితు ల నుంచి పోలీసులు సీజ్‌ చేసిన ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ స్వాధీనాన్ని ధ్రువీకరించాల్సిందిగా కోరతారు. ఈ మేరకు ధ్రువీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. వీటి ఆధారంగా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జోడిస్తూ పోలీసులు కోర్టుల్లో పిటిషన్‌ దాఖలు చేస్తారు. నిందితుల ఆస్తుల స్వాధీనం సమంజసమేనంటూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తారు. ఈ పిటిషన్‌ పూర్వాపరాలను పరిశీలించి కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా సీసీఎస్‌ పోలీసులు నౌహీరా షేక్‌తోపాటు ఆ సంస్థలకు చెందిన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, టోలిచౌక్, ఏపీలోని చిత్తూరు జిల్లా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణేలోని పలు ప్లాట్లు, ఇళ్ల వివరాలను సేకరించారు. వీటిని అటాచ్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.   

మరిన్ని వార్తలు