అనుమతులు లేని ఆస్పత్రులపై చర్యలు

14 Mar, 2017 17:35 IST|Sakshi

జోగిపేట: జిల్లాలో అనుమతులు లేకుండా కొనసాగే ప్రైవేట్‌ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా సీజ్‌ చేస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ గాయత్రీదేవి హెచ్చరించారు. సోమవారం జోగిపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రులను తనిఖీ చేసిన అనంతరం విలేరులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో 230 ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయని, మరికొన్ని అనుమతులు లేకుండా కొనసాగుతున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. వాటిపై విచారణ జరిపి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో తప్పనిసరిగా ట్రీట్‌మెంట్, పరీక్షలకు తీసుకున్న రేట్ల పట్టికను పేషెంట్‌లు కూర్చునే స్థలంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా డాక్టర్లు అందుబాటులో ఉండే వివరాలను కూడా అందులో పేర్కొనాలన్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొనసాగే ట్రీట్‌మెంట్‌ వివరాలపై ప్రతినెలా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ డాక్టర్‌లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. డెలివరీకి వచ్చే పేషెంట్లకు అనవసరంగా ఆపరేషన్లు చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ స్వయంగా తెలిపారని, దీనిపై ప్రత్యేక నిఘా వేశామని తెలిపారు. ఎంటీపీ కోసం ప్రత్యేకంగా అనుమతి పొందాల్సి ఉంటుందని, అవసరమైతే తప్ప ఎంటీపీ చేయకూడదన్నారు. పీహెచ్‌సీలల్లో కూడా డెలివరీలు అవుతున్నాయని, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీహెచ్‌సీలల్లో డెలివరీలపై దృష్టి సారించానన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలవరీలు అయితే ప్రభుత్వం రూ.14 వేలు ప్రకటించిందని, ఆడ పిల్ల పుడితే మరో రూ.1000తో పాటు రూ.2వేల విలువ చేసే హెల్త్‌కిట్‌ కూడా  పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే జహీరాబాద్, సంగారెడ్డి , నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రైవేటన్న ఆస్పత్రులను తనిఖీ చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు