‘డెత్‌ట్రాక్స్‌’పై స్పెషల్‌ డ్రైవ్‌ 

8 Feb, 2019 00:08 IST|Sakshi

‘సాక్షి’ కథనంపై కదిలిన దక్షిణ మధ్య రైల్వే 

ప్రమాదాల నియంత్రణకు చర్యలు షురూ

ఆర్పీఎఫ్, జీఆర్పీతో కలసి కార్యాచరణ: సీపీఆర్వో రాకేశ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో రక్తసిక్తమవుతున్న రైలుపట్టాల గురించి ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనంపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. నగరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ‘డెత్‌ ట్రాక్స్‌’ నివారణకు చర్యలు చేపట్టింది. ప్రమాదాలకు అవకాశమున్న అన్ని చోట్లా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం తెలిపారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో కలిసి కార్యాచరణ కొనసాగించనున్నట్లు చెప్పారు. జంటనగరాల్లో ప్రమాదకరంగా మారిన రైల్వే పట్టాలపై.. ‘డెత్‌ట్రాక్స్‌’ శీర్షికన ‘సాక్షి’ గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురిం చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కదిలిన రైల్వే శాఖ.. పోస్టర్లు, కరపత్రాలు, తదితర రూపాల్లో ప్రచారం చేయడంతోపాటు రైల్వే చట్టాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించింది.

గతంలో కంటే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, పట్టాలు దాటకుండా అనేక చర్యలు చేపట్టామని రాకేశ్‌ తెలిపారు. కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతున్నట్లు గమనించామన్నారు. అవసరమైన అన్ని చోట్లా సైడ్‌వాల్స్, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు, ప్రజల భద్రత దృష్ట్యా ట్రాక్‌లపై రైల్వే శాఖ చేపట్టే అవగాహన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని సుమారు 48 కిలోమీటర్ల ఎంఎంటీఎస్‌ ట్రాక్‌ మార్గంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు సీపీఆర్వో స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు