ఆదర్శ రైతులకు ఉద్వాసన

22 Sep, 2014 23:07 IST|Sakshi

జిల్లాలో 1,040 మంది రైతుల సేవలు బంద్

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఆదర్శ రైతులకు ప్రభుత్వం మంగళం పాడింది. వీరితో వ్యవసాయ రంగానికి పెద్దగా ప్రయోజనం చేకూరలేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు ఏడేళ్లుగా కొనసాగుతున్న ఆదర్శ రైతుల సేవలు నిలిచిపోయినట్టయింది. సాగులో నూతన ఒరవడులతో దూసుకెళ్తున్న రైతులకు సేవలను విస్తృతం చేసేందుకు ఏడేళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆదర్శ రైతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
 
సరికొత్త పద్ధతులతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులను ఈ కార్యక్రమం కింద ఎంపికచేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ పథకంపై నిర్లక్ష్యం చూపారు. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం.. వారికిచ్చే గౌరవ వేతన చెల్లింపుల్లో జాప్యం చేయడం.. ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రమంగా వారి ప్రాధాన్యత తగ్గించడంతో ఈ కార్యక్రమం వెనకబడిపోయింది. తాజాగా అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్  ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
 
గతంలోనే తప్పుకున్న కొందరు..
ఆదర్శ రైతుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,350 మంది రైతులను ఎంపిక చేశారు. వ్యవసాయ శాఖ కార్యక్రమాల్లో వీరిని భాగస్వామ్యం చేస్తూ.. వారి సలహాలు, సూచనలు తీసుకునేవారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నందుకు  ప్రభుత్వం ప్రతి ఆదర్శ రైతుకు నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆదర్శ రైతులకు ప్రతినెల రూ.13.50లక్షలు ఖర్చు చేస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల వీరిలో 310 మంది రైతులను విధుల నుంచి తప్పించారు. దీంతో ప్రస్తుతం ఈ సంఖ్య 1,040కు తగ్గింది. తాజాగా ఆదర్శ రైతుల విధానాన్ని పూర్తిగా రద్దు చేయడంతో 1,040 మంది రైతుల ‘ఆదర్శ’ సేవలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు