రైల్వే స్టేషన్లలో అదనపు సదుపాయాలు

11 Sep, 2014 04:05 IST|Sakshi
రైల్వే స్టేషన్లలో అదనపు సదుపాయాలు

సాక్షి,సిటీబ్యూరో: ప్రయాణికులకు రైల్వే స్టేషన్లలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఈ ఆర్ధిక సంవత్సరం చర్యలు చేపట్టినట్టు దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ రాకేష్ అరోన్ తెలిపారు. బుధవారం సికింద్రాబాద్‌లోని డివిజన్ కార్యాలయంలో జరిగిన 55వ రైల్వే వినియోగదారుల కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన చైర్మన్ హోదాలో పాల్గొని ప్రసంగించారు.

కాచిగూడ స్టేషన్‌లో ఏసీ విశ్రాంతి గది ఏర్పాటుతో పాటు, స్టేషన్ టిక్కెట్ బుకింగ్ సేవక్‌లను కూడా నియమించినట్టు చెప్పారు. ఇప్పటికే  కాచిగూడ, కర్నూల్ సిటీ స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటయ్యాయని, మరికొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు కూడా ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సూర్య చంద్రరావు, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ బి.ఎస్.కె.రాజ్‌కుమార్, కమిటీ సభ్యులు నూర్ తదితరులు పాల్గొన్నారు.
 
వాహనదారులూ జాగ్రత్త..
 
కాపలా లేని రైల్వే గేట్ల వద్ద పాదచారులు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని రాకేష్ అరోన్ సూచించారు. ఇలాంటి గేట్ల వద్ద ఇప్పటికే వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. కాపలా లేని గేట్లపై కన్సల్టేటివ్ క మిటీ సభ్యులు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
 
నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా
 
మౌలాలి రైల్వేగేట్ వద్ద ఈనెల 5న చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించి గేటు దాటిన వాహనదారులకు జరిమానా విధించినట్లు సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్ అదనపు రైల్వే మేనేజర్ బి.సింగయ్య నేతృత్వంలో ఆర్‌పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారన్నారు. ఇందులో 15 మందిపై కేసులు నమోదు చేయగా, మరో 16 మందికి రైల్వే కోర్టు ఆదేశాల మేరకు రూ.800 చొప్పున జరిమానా విధించామన్నారు.
 

మరిన్ని వార్తలు