అదనపు బలగాలపైనే ఆశ

24 Mar, 2014 00:17 IST|Sakshi
అదనపు బలగాలపైనే ఆశ
  •      ఎన్నికల బందోబస్తుకు పోలీసుల కసరత్తు
  •      50 కంపెనీల ‘కేంద్ర ’ ఫోర్స్ కావాలంటున్న కొత్వాల్
  •      ఒక్కో బూత్‌కు ఒక్కో కానిస్టేబుల్..
  •      సమస్యాత్మక బూత్‌ల వద్ద ఇద్దరుండాలి: ఎన్నికల సంఘం
  •  సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లలో నగర పోలీసులు తలమునకలై ఉన్నారు. కమిషనర్ అనురాగ్‌శర్మ..  అదనపు పోలీసు కమిషనర్లు, జాయింట్ పోలీసు కమిషనర్లతో బందోబస్తు ప్రణాళికను తయారు చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నా సిబ్బంది కొరతను అధిగమించడమెలా అన్నది ప్రధాన సమస్యగా మారింది.

    ఈ నేపథ్యంలో కమిషనర్ అదనపు బలగాలపైనే ఆశ పెట్టుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోకి 15 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు వస్తాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి 1484 పోలింగ్‌స్టేషన్‌లు, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 1405, మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 202 పోలింగ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 35,98,152 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకునేందుకు వీలుగా పోలీసులు కసరత్తులు చేస్తున్నారు.

    ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో మూడు నుంచి ఆరు వరకు బూత్‌లు ఉంటాయి. ఇందులో పురుషులు, మహిళల బూత్‌లు వేరు వేరుగా ఉంటాయి. ఒక్కో బూత్‌కు ఒక్కో కానిస్టేబుల్‌ను, సమస్యాత్మక ప్రాంతాలలో ఇద్దరు కానిస్టేబుళ్లను తప్పనిసరిగా బందోబస్తులో ఉంచాలని ఎన్నికల సంఘం నగర పోలీసు కమిషనర్‌కు సూచించింది.

    ఈ రకంగా చూసుకుంటే 3091 పోలింగ్ స్టేషన్లలో బూత్‌ల సంఖ్య పదివేలకు పైగా పెరగవచ్చు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా చూస్తే.. కేవలం బూత్‌ల వ ద్దే 15,000 మంది కానిస్టేబుళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే నగర పోలీసు విభాగంలో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వులో కానిస్టేబుళ్లు 5015 మందే ఉన్నారు.

    కానిస్టేబుల్ స్థానంలో హోంగార్డులను ఉపయోగిస్తే ఆ సంఖ్య ఎనిమిది వేలకు చేరుతుంది. బూత్‌ల వద్ద బందోబస్తుకే పోలీసులు సరిపోరు. ఇక బూత్‌ల బయట ఉండే స్ట్రైకింగ్‌ఫోర్స్, పికెట్లు, మొబైల్ పెట్రోలింగ్, వీడియో సిబ్బంది తదితరాలన్నీ చూసుకుంటే సిబ్బందిని కేటాయించడం కష్టం. కానిస్టేబుల్ నుంచి నగర కమిషనర్ వరకు మొత్తం మన దగ్గర సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు కలిపి మొత్తం 8698 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు.
     
    అదనంగా 50 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు
     
    నగరంలో ఉన్న సిబ్బంది ఎన్నికల బందోబస్తుకే ఏ మాత్రం సరికపోకపోవడంతో కేంద్రం నుంచి మరో 50 కంపెనీల పారామిలటరీ బలగాలను రప్పించేందుకు నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ కసరత్తు చేస్తున్నారు. ఈ కంపెనీలు వచ్చినా బందోబస్తు పూర్తిగా నెరవేరినట్లు కాదు. ఉన్న సిబ్బందితోనే పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు.
     
    కోడ్ ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించండి : అదనపు కమిషనర్

     
    కోడ్ ఉల్లంఘనపై దృష్టి సారించాలని శాంతి భద్రతల ఏసీపీల సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. నియోజక వర్గం రిటర్నింగ్ అధికారితో ఆయా ఏసీపీలు సమన్వయం చేసుకోవాలని, వాల్‌పోస్టర్లు, ఫెక్సీలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే 29 ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించి తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. మద్యం, అక్రమ ఆయుధాలు, లెసైన్స్ ఆయుధాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏసీపీలకు సూచించారు.
     

మరిన్ని వార్తలు