‘విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు’

10 Dec, 2018 20:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అడిషనల్‌ డీజీ జితేందర్‌ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌ ప్రశాతంగా జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్‌ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సీసీ కెమరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. కౌంటింగ్‌ సెంటర్ల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించామని అన్నారు. పాస్‌లు ఉన్నవారినే కౌంటింగ్‌ సెంటర్లలోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

అన్ని కౌంటింగ్‌ సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని కోరారు. సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి 2014లో 1600కు పైగా కేసులు నమోదు కాగా, ఈ సారి 1500కు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్‌ నేత రోహిత్‌ రెడ్డికి భద్రత కల్పించాలని ఆ పార్టీ నేతలు డీజీపీని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. కౌంటింగ్‌ సెంటర్లలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు