అదనపు ఈవీఎంల కేటాయింపు

24 Mar, 2019 15:18 IST|Sakshi

‘పార్లమెంట్‌’ పోలింగ్‌ రోజు మొరాయిస్తే రీప్లేస్‌మెంట్‌

ముందు జాగ్రత్త చర్యగా 20 శాతం ఈవీఎంలు కేటాయింపు

మోర్తాడ్‌(బాల్కొండ):  పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే మరో ఈవీఎంను ఏర్పాటు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి అదనపు ఈవీఎంలను కేటాయిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు మరోవైపు వేగంగా సాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోయినా ఈవీఎంలను కేటాయించి వాటిని శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు కేటాయిస్తున్నారు. నామినేషన్ల విత్‌డ్రాలు పూర్తయిన తరువాత బరిలో ఉండే అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించే గుర్తులను అధికారులు ప్రకటించనున్నారు. అయితే శాసనసభ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను కేటాయించి వాటిని భద్రపరచనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి అవసరమైన ఈవీఎంలతో పాటు అదనంగా మరికొన్నింటిని అందుబాటులో ఉంచడానికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో 1,919 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ప్రతి నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య ప్రకారం ఈవీఎంలను కేటాయిస్తున్నారు. అంతేకాకుండా అనుకోకుండా ఈవీఎంలు మొరాయించి పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోతే మళ్లీ కొనసాగించడానికి ముందస్తు చర్యలను తీసుకుంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలకు ఈవీఎంలు చేరుకోగా నియోజకవర్గాల వారీగా వాటిని కేటాయిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 10 నుంచి 20 శాతం అదనపు ఈవీఎంలు కేటాయిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదలైన తరువాత శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలను ర్యాండమైజేషన్‌ చేస్తారు. ఆ తరువాత అభ్యర్థుల వివరాలు, కేటాయించిన గుర్తులను చేర్చి సాంకేతిక సమస్యలు ఉన్నాయో లేవో అని పరిశీలించి భద్రపరుస్తారు. పోలింగ్‌ ఏప్రిల్‌ 11న జరుగనున్న దృష్టా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు