కరపత్రాలు, పోస్టర్లపై చిరునామా తప్పనిసరి! 

16 Jun, 2018 01:18 IST|Sakshi

వాటిపై ప్రచురించేవారి పేరు ఉండాల్సిందే..

పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంపై ఈసీ మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. సర్పంచ్, వార్డు స భ్యుల ప్రచారం కోసం ముద్రించే కరపత్రాలు, పోస్టర్లపై కచ్చితంగా ప్రచురణదారు పేరు, చిరునామా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అభ్యర్థుల ప్రచార సరళి, కరపత్రాలు, పోస్టర్ల ముద్రణ తదితర అంశాలకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 

డిక్లరేషన్‌ ఇచ్చాకే: ప్రింటింగ్‌ ప్రెస్‌లు, పబ్లిషర్లుగానీ.. ప్రచురణకర్తల పేర్లు, చిరునామాలు లేకుండా కరపత్రాలు, పోస్టర్లను ముద్రించకూడదు. అభ్యర్థుల తరఫున కరపత్రాలు, పోస్టర్లు ముద్రించాలనుకున్న వారు.. తమ వ్యక్తిగత గుర్తింపు  ధ్రువపత్రాలను, తనకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరు సంతకాలతో ప్రింటర్‌కు ఇవ్వాలి. ముద్రించిన కరపత్రాలు, పోస్టర్ల కాపీలకు ప్రచురణకర్త డిక్లరేషన్‌ను జత చేసి నిర్దిష్ట సమయంలో ఎన్నికల సంఘం, జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయాలకు పంపిన  తర్వాతే వాటిని వినియోగించాల్సి ఉంటుంది. 

నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష, లైసెన్సు రద్దు  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన 3 రోజుల్లోగా అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లు వారి పరిధిలోని  ప్రింటింగ్‌ ప్రెస్‌లు, పబ్లిషర్లకు ఎన్నికల నిబంధనలను తెలియజేయాలి. కరపత్రాలు, పోస్టర్లను ముద్రించిన 3 రోజుల్లోగా వాటి కాపీలను డిక్లరేషన్‌తో సహా జిల్లా మేజిస్ట్రేట్, ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని ఆదేశించాలి. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించిన ప్రింటింగ్‌ ప్రెస్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తారు.

ఇక, నిబంధనలు పాటించకుండా కరపత్రాలు, పోస్టర్లను ముద్రించి ప్రచారంలో వినియోగించే ప్రచురణకర్తలకు 6 నెలల జైలు, రూ. 2 వేల జరినామా విధిస్తారు. కరపత్రాలు, పోస్టర్లను ఏ నమూనాలో ముద్రించాలనే దానిపైనా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేయ నుంది. కరపత్రాలు, పోస్టర్లలోని  సమా చారం ఆధారంగా ఏ అభ్యర్థికి ప్రయోజనకరమో గమనించి వారి ఎన్నికల వ్యయంలో ఈ ఖర్చులనూ జమ చేస్తారు. 

మరిన్ని వార్తలు