ఎస్టీల్లో ఉన్నా అన్యాయమే..

10 Dec, 2017 02:46 IST|Sakshi

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా రిజర్వేషన్లలో వెనుకబాటే

ఆదివాసీల మహాగర్జన సభలో ఎంపీ ఫగ్గన్‌సింగ్‌ కులస్తే

విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలూ అందని దుస్థితి

గిరిజన తెగల కోసం కమిషన్లు వేసినా నివేదికలేవీ?

హక్కుల కోసమే ఆదివాసీల పోరాటమన్న కేంద్ర మాజీ మంత్రి

ప్రభుత్వం దిగిరాకుంటే రాష్ట్రాన్ని  స్తంభింపజేస్తాం: సోయం బాబూరావు

20 రాష్ట్రాల నుంచి లక్షకుపైగా ఆదివాసీలు సభకు హాజరు

సాక్షి, హైదరాబాద్‌ :  ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఆదివాసీలకు అందడం లేదు. ఎస్టీలుగా ఉన్నా, దేశంలో అణగారిన తెగగా చెప్పబడుతున్నా అన్యాయమే జరుగుతోంది. విద్య, ఉద్యోగావకాశాలు అందక వెనుకబాటు పెరుగుతోంది. దీన్ని అధిగమించాలంటే ఆదివాసీల డిమాండ్ల పరిష్కారమే ఏకైక మార్గం’అని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు ఫగ్గన్‌సింగ్‌ కులస్తే ఉద్ఘాటించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో శనివారం ఆదివాసీల మహాగర్జన జరిగింది. తుడుందెబ్బ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు 20 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు హాజరయ్యారు.

మహాగర్జనకు ముఖ్యఅతిథిగా హాజరైన ఫగ్గన్‌సింగ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆదివాసీలు భూమిని నమ్ముకునే జీవిస్తున్నారని, వారికి సౌకర్యాలు కల్పించి వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఎస్టీల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆదివాసీలకు చేరడం లేదని, దీంతో వారంతా హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గిరిజన తెగల కోసం గత ప్రభుత్వాలు ఎన్నో కమిషన్‌లు ఏర్పాటు చేసినా వారిచ్చిన నివేదికలు మాత్రం బయటకు రాలేదన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ట్రైబల్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశారని, ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమ కార్యక్రమాలు విస్తృతం చేశారని వివరించారు. కుమ్రం భీం, రాంజీగోండ్‌ లాంటి మహానుభావులు పుట్టిన తెలంగాణలో ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని, వారడుగుతున్న డిమాండ్లు సమ్మతమైనవని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని తప్పక నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు ఆదివాసీల హక్కని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కోవా లక్ష్మికి నిరసనల సెగ
ఆసిఫాబాద్‌ శాసన సభ్యురాలు కోవా లక్ష్మికి ఆదివాసీల మహాగర్జనలో నిరసనల సెగ తగిలింది. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఆదివాసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారని కోవా లక్ష్మి పేర్కొన్నారు. దీంతో సభకు హాజరైనవారు కేసీఆర్‌ డౌన్‌డౌన్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కోవా లక్ష్మికి వ్యతిరేఖంగా నినాదాలు ఊపందుకోవడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు.

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజనుల మధ్య ఆదిలాబాద్‌ కలెక్టర్‌ చంపాలాల్‌ చిచ్చు పెట్టారని, ఏజెన్సీలో లంబాడ కలెక్టర్‌ను ఎలా నియమిస్తారని, ఇది ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, జీపీపీ జాతీయాధ్యక్షుడు హీరాసింగ్‌ మాల్కం, ప్రొఫెసర్లు వీరాలాల్‌ అల్వా, నాగేశ్వరరావు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, మహిళా కార్యదర్శి సుగుణ, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు వివేక్‌ వినాయక్, కొప్పుల రవి, డాక్టర్‌ నిరంజన్‌ పాల్గొన్నారు.

మహాగర్జనకు భారీ స్పందన
ఆదివాసీల మహాగర్జనకు అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ నుంచే కాకుండా దేశంలోని 20 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యారు. శనివారం ఉదయం 6 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఆదివాసీలు సరూర్‌నగర్‌ స్టేడియంకు చేరుకున్నారు. వందల సంఖ్యలో వచ్చిన వాహనాలతో ఎల్బీనగర్‌–చైతన్యపురి మధ్య ట్రాఫిక్‌ కిక్కిరిసింది. రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సభకు దాదాపు లక్ష మంది ఆదివాసీలు వచ్చినట్లు అంచనా. భారీగా జనం రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  


మహాగర్జన తీర్మానాలివే..
  లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి.  
చట్టబద్ధత లేని లంబాడాల ఎస్టీ హోదాను తక్షణమే రద్దు చేయాలి.
ఆర్టికల్‌ 342 ప్రకారం రాజ్యాంగ పరిషత్‌ కమిటీ గుర్తించిన 9 ఆదిమ తెగలకే 1915 గెజిట్‌ ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు వర్తింపచేయాలి.
ఎస్టీ కుల ధృవీకరణ, ఏజెన్సీ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన లంబాడీ ఉద్యోగులపై విచారణ జరిపి ఉద్యోగాలు తొలగించాలి.
షెడ్యూల్‌ ఏరియాలోని లంబాడ అధికారులను మైదాన ప్రాంతాలకు బదిలీ చేసి ఆదివాసీలను నియమించాలి.
ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు, ఇంటర్, డిగ్రీ, మెడిసిన్, న్యాయ, ఫార్మసీ కోర్సులతో విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి.
అటవీ హక్కుల చట్టం ప్రకారం షెడ్యూల్‌ ఏరియాలో ఆదివాసీలు సాగిస్తున్న వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలి.
ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని 9 ఆదిమ తెగల అభివృద్ధికే కేటాయించాలి.
కుమ్రంభీం వర్ధంతి సభ సందర్భంగా ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిలో 333 మంది ఆదివాసీ తెగల అభ్యర్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తేయాలి.  


లంబాడీలతోనే పెను ప్రమాదం: సోయం బాబూరావు
తెలంగాణలోని ఆదివాసీలకు ఆంధ్రోళ్ల కంటే లంబాడీలతోనే పెను ప్రమాదం ఉందని, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగిస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబూరావు అన్నారు. ఆదివాసీల హక్కులు సాధించే వరకు పోరాటం ఆపబోమని, ఈ నెల 15 వరకు ప్రభుత్వానికి గడువిస్తున్నామని, డిమాండ్ల పరిష్కారంపై దిగిరాకుంటే పోరాటం తీవ్రం చేస్తామని, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్‌ నుంచి ఎంపీ నగేశ్‌ హామీ తెచ్చే వరకు పోరాటం ఆగదని, తల తాకట్టు పెట్టైనా ఆదివాసీలకు న్యాయం జరిగేలా పోరాడుతానని పేర్కొన్నారు. త్వరలో వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆదివాసీ మహిళలతోనూ సభ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్‌ మాట్లాడుతూ.. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయం, లంబాడీల వల్ల కలిగే నష్టాన్ని ప్రభుత్వానికి వివరించానని చెప్పారు. ప్రభుత్వపరంగా ఆదివాసీలకు లబ్ధి జరిగేలా సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఏ పార్టీ ముందుకు రాలేదని, న్యాయం చేయలేదని భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య ఆరోపించారు. జీవో నం.3 తీసుకొస్తే తాను పూర్తిగా వ్యతిరేకించానని, దీంతో ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు