కుటుంబసమేతంగా జోడేఘాట్‌కు కలెక్టర్‌

27 Dec, 2019 09:29 IST|Sakshi
నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ కుటుంబం

కెరమెరి(ఆసిఫాబాద్‌): కుమురం భీం మ్యూజియం ఓ అద్భుతమని..గిరిజన సంప్రదాయాలు, సంస్కతికి ప్రతీకగా నిలుస్తోందని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. గురువారం చారిత్రక ప్రదేశమైన కెరిమెరి మండలం జోడేఘాట్‌లో ఏర్పాటు చేసిన కుమురం భీం మ్యూజియాన్ని కలెక్టర్‌ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు, గ్రామస్తులు వారికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. భీం సమాధిపై పూలు చల్లారు. వారికి మ్యూజియం క్యూరేటర్‌ మంగం విశ్వంభర్‌రావు భీం చరిత్రతో పాటు అన్ని విషయాలపై అవగాహన కల్పించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన హైమన్‌డార్ఫ్‌ చిత్రమాలిక, ఆదివాసీల ఫొటో ఫ్రేంలు పరిశీలించారు. స్మృతిచిహ్నం, మనిషి ఆకృతిలో ఉన్న బొటానికల్‌ గార్డెన్, ఆదివాసీ ఆభరణాలు, పర్‌దాన్, తోటి, గోండు, నాయకపోడ్, తదితర కులాలకు చెందిన దేవతా ప్రతిమలను తిలకించారు. అనంతరం గుస్సాడీల నృత్యాలు, తన సహచరులతో మాట్లాడుతున్నట్లు ఉన్న భీం ప్రతిమలను చూసి కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజియానికి వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు వస్తారని.. మీరు కూడా వచ్చి సమస్యలు తెలుపవచ్చని స్థానికులకు సూచించారు. వారి వెంట తహసీల్దార్‌ ప్రమోద్‌ కుమార్, ఏటీడీవో భాస్కర్, ఎంపీపీ పెందోర్‌ మోతిరాం, జెడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి, నాయకులు పెందోర్‌ రాజేశ్వర్, మోహన్‌రావు, కోవ విజయ్,  మడావి రఘు తదితరులు ఉన్నారు.   

మరిన్ని వార్తలు