‘ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాలి’

29 Sep, 2014 00:51 IST|Sakshi

హైదరాబాద్: ఆదివాసీ యోధుడు కొమురం భీం పేరును ఆదిలాబాద్ జిల్లాకు పెట్టాలని ఆచార్య జయధీర్ తిరుమలరావు, అరుణోదయ విమలక్క డిమాండ్ చేశారు. అక్టోబరు 7, 8 తేదీలలో జోడే ఘాట్‌లో కొమురం భీం 74వ వ ర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరుతూ కొమురం భీం వర్ధంతి కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వీరు ప్రచార కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా దోమలగూడలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొమురం భీం చిత్రాన్ని పార్లమెంటులో పెట్టాలని, ఉట్నూరులో ఆదివాసీ వర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద నిషేధాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. జోడే ఘాట్‌లోనే కొమురం భీం వర్ధంతిని నిర్వహించాలని కోరారు. రూ. 200 కోట్లతో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని, ఆయన పేరిట ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొము రం భీం మనవడు కొమురం సోనేరావు, వర్ధంతి కమిటీ చైర్మన్ కోవ దేవ్‌రావ్  తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు