ఆదిలాబాద్‌లో నాలుగు నామినేషన్లు  తిరస్కరణ

27 Mar, 2019 15:49 IST|Sakshi
నామినేషన్లను పరిశీలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి దివ్యదేవరాజన్, పరిశీలకులు సంజయ్‌కుమార్‌

నామినేషన్లను పరిశీలిస్తున్న అధికారులు

13 సరైనవని తేల్చిన అధికారులు 

ఈ నెల 28 వరకు ఉపసంహరణకు గడువు

సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ కేంద్రంలో రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పరిశీలన ప్రక్రియ కొనసాగింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆదిలాబాద్‌ లోక్‌సభకు మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా, 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

అయితే లోక్‌సభ స్థానానికి వచ్చిన నామినేషన్లలో నలుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ తెలిపారు. మిగతా 13 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నట్లు వివరించారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన రితేశ్‌ రాథోడ్, జాదవ్‌ నరేశ్, ఆల్‌ ఇండియా ఫార్వడ్‌ బ్లాక్‌ నుంచి భుక్యా గోవింద్, సమాజ్‌వాది ఫార్వడ్‌ బ్లాక్‌ నుంచి పోటీ చేసిన లకావత్‌ విజయ్‌కుమార్‌ల నామినేషన్లు తిరస్కరించినట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఈ పరిశీలనలో జేసీ సంధ్యారాణి, సబ్‌ కలెక్టర్‌ గోపి, సహాయ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, తహశీల్దార్లు, రాజకీయ, స్వతంత్ర అభ్యర్థుల ప్రతినిధులు పాల్గొన్నారు.

28 వరకు ఉపసంహరణకు గడువు 
ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు ఉంది. పరిశీలన అనంతరం 13 అభ్యర్థులు ఉపసంహరణ బరిలో ఉండగా, ఎంత మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఐదు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించగా, సోమవారం ఒక్క రోజే భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఆఖరి రోజు దాఖలైన నాలుగు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం విశేషం. 
పెద్దపల్లిలో పది తిరస్కరణ

పెద్దపల్లి: పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేసిన 21 మందిలో పది మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. నామినేషన్ల స్క్రూటినీ మంగళవారం నిర్వహించారు. కలెక్టర్, రిటర్నింగ్‌ అధికారి శ్రీదేవసేన, ఎన్నికల పర్యవేక్షణ అధికారి రాజారాం ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రూటినీలో సగంమంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బీజేపీ తరఫున నామినేషన్‌ వేసిన కొయ్యడ స్వామి బీఫాం, ఏ ఫాం వివరాలు అందించకపోవడంతో నామినేషన్‌ తిరస్కరించారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ తరఫున, స్వతంత్య్ర అభ్యర్థిగా గంధం శంకర్‌ రెండు సెట్ల నామినేషన్‌ వేశారు. అయితే తన ప్రతిపాదనలు సరిగా చూపకపోవడంతో రెండూ తిరస్కరణకు గురయ్యాయి. సీపీఐఎంఎల్‌ రెడ్‌స్టార్‌ అభ్యర్థిగా మల్లేశం నామినేషన్‌ వేయగా వివరాలు సరిగా లేక అధికారులు తిరస్కరించారు.

జనతాదళ్‌ ఫేం అభ్యర్థి ఎస్‌.గంగాధర్‌ దాఖలు చేసిన రెండు సెట్లలో 2 సీకి బదులు 1సీ నింపడంతో రెండు సెట్లు చెల్లుబాటు కాలేదు. దళిత బహుజన్‌పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన క్రాంతికుమార్, తన ఫాం సరిగా నింపకపోవడంతో తిరస్కరించారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ అభ్యర్థి ఎం.గణేశ్, భారతీయ అనరాక్షిత పార్టీ అభ్యర్థి బి.వెంకటేశం తమ ఫాంలలో ఏ విభాగాన్ని ఖాళీగా ఉంచడంతో వాటిని కొట్టేశామని అధికారులు తెలిపారు. స్వతంత్య్ర అభ్యర్థులు జె.నరేశ్, రాచర్ల రాజేశం, బొజ్జ దశరథ్‌ వేసిన నామినేషన్లలో తప్పులు దొర్లడంతోపాటు అఫిడవిట్‌లు దాఖలు చేయకపోవడం, పార్ట్‌– 3ఏ లో ఇవ్వాల్సిన వివరాలు సరిగా లేనందున వాటిని కూడా అధికారులు తిరస్కరించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకే నామినేషన్ల స్క్రుటినీ నిర్వహించి నిబంధనల ప్రకారం లేనివాటిని తిరస్కరించామని రిటర్నింగ్‌ అధికారి శ్రీదేవసేన తెలిపారు.

మరిన్ని వార్తలు