గల్ఫ్‌ కార్మికునిపై కరోనా కాటు

23 Jul, 2020 11:09 IST|Sakshi
శంకర్‌

లాక్‌డౌన్‌తో పరాయిదేశంలో పనిలేక పస్తులు

ఇరాక్‌లో మండలవాసి మృతి

జన్నారం(ఖానాపూర్‌): కరోనా వైరస్‌ ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కొందరు పనుల్లేక ఇబ్బందులు పడుతుంటే మరికొందరు ఇంటికి రాలేక పస్తులుండి కానరాని లోకాలకు వెళ్తున్నారు. జన్నారం మండలం మహ్మదబాద్‌కు చెందిన కొండగొర్ల శంకర్‌ (42) కరోనా వైరస్‌ కారణంగా పనుల్లేక 20 రోజులుగా పస్తులున్నాడు. అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌ ఏడాది క్రితం విజిట్‌ వీసాపై ఇరాక్‌ దేశం వెళ్లాడు. ఎర్బిల్‌ ప్రాంతంలో పనికి కుదిరాడు. కరోనా కారణంగా ఏప్రిల్‌లో ఇరాక్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో పనిలేక రోడ్డున పడ్డాడు. తెలిసిన వారు లేకపోవడంతో ఆకలికి అలమటిస్తూ రోడ్డుపక్కన పడిపోయాడు. గమనించిన కొందరు అతన్ని అక్కడి ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు అతన్ని చేరదీశారు. అప్పటికే అనారోగ్యం బారిన పడ్డ శంకర్‌ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతదేహాన్ని అక్కడి తెలుగు గల్ఫ్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎలగొండ దక్షణమూర్తి, రాయలవారి రాంచందర్‌లు ఎర్బిల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య సత్తవ్వతో పాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని సత్తవ్వ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

‘సాక్షి’ కథనంతో వెలుగులోకి...
ఇరాక్‌లోని ఎర్బిల్‌లో పనిచేస్తున్న కొండగొర్ల శంకర్‌ అనారోగ్యంతో మంచం పట్టిన విషయాన్ని ఈనెల 21న సాక్షిలో ‘ఉపాధి వేటలో జీవచ్ఛవాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. గల్ఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమురయ్య విషయాన్ని ఎన్‌ఆర్‌ఐ శాఖ ప్రభుత్వ అధికారి చిట్టిబాబు దృష్టికి తీసుకెళ్లాడు. కానీ ఆయన స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకునే లోపే శంకర్‌ మృతి చెందడం దురదృష్టకరం. కరోనా సమయంలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురుఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు