'పోడు'చే వారెవరు?

13 Mar, 2019 10:21 IST|Sakshi
ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి లేక గూడ్సు రైలు మధ్య నుంచి దాటుతున్న ప్రయాణికులు

ఆదిలాబాద్‌లో ప్రభావితాంశాలివే..

సాక్షి, ఆసిఫాబాద్‌ :ఆదిలాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యంగా గిరిజనుల పోడు వ్యవసాయం సమస్య ప్రభావం చూపనుంది. అలాగే, ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆసిఫాబాద్‌ (ఎస్టీ), సిర్పూర్‌ టీ (జనరల్‌) రానున్నాయి. జిల్లాలో లోక్‌సభ పరిధి రెబ్బెన మండలం తక్కళ్లపల్లి గ్రామం నుంచి ప్రారంభమై వాంకిడి మండలం గోయగాంతో ముగుస్తుంది. మొత్తం రాజీవ్‌ రాష్ట్రీయ రహదారి గుండా ఈ పరిధి 60 కిలోమీటర్లు ఉంటుంది. గిరిజన, సరిహద్దు ప్రాంతం, భూపట్టాలు, కుల ధ్రువీకరణ పత్రాల వంటి ముఖ్య సమ స్యలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. 

ప్రజా ఎజెండా.... పోడు సమస్య
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల హామీలకు మాత్రమే పరిమితమై, ప్రతి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా, ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్య పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులది. అనాదిగా అటవీ భూములను సాగు చేసుకుంటు భూ యాజమాన్య హక్కులు లేక గిరిజన, గిరిజనేతర రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఈ సమస్య ఉంది. 

వీరికి భూయాజమాన్య హక్కులు కల్పించేందుకు గిరిజన పోరాటయోధుడు కొమరం భీం, అనంతరం లండన్‌ ప్రొఫెసర్‌ హైమన్‌ డార్ఫ్‌లాంటి వారు అనేక పోరాటాలు చేశారు. వారి పోరాట ఫలితంగా నాటి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  మొదటి సారిగా ఉమ్మడి ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతంలో సుమారు 1.6 లక్షల ఎకరాల భూమిని సుమారు 12వేల గిరిజన కుటుంబాలకు చట్టబద్దం చేసేందుకు ‘హైదరాబాద్‌ ట్రై బల్‌ ఏరియాస్‌ రెగ్యులేషన్‌ 1356 ఫస్లీ(1946)ని జారీ చేశారు. దీంతో మొదటి సారిగా భూమిపై శాసనబద్ధంగా గిరిజనులకు హక్కులు వచ్చినట్లయింది. అనంతరం పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2006లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్‌ 31 నాటికి అటవీ భూములను సాగు చేస్తున్న వారికి అటవీ సాగు హక్కు గుర్తింపు పత్రాలను అందజేసింది.

ఈ గుర్తింపు హక్కు పత్రాల కోసం పోడు వ్యవసాయదారుల భూమి సర్వే చేసి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ను జారీ చేసింది. అయితే రాను రాను పోడు రైతుల సాగు అవసరాలు పెరగడంతో పాటు గతంలో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ సర్వే పూర్తి స్థాయిలోజరగకపోవడంతో అటవీ రక్షణ చర్యలు పెరగడంతో అనేక మంది రైతులు పోడు పట్టాలు అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలోని మొత్తం 37,181 మంది పోడు రైతులకు 1,35,310 ఎకరాల భూమికి హక్కులు వచ్చాయి. అయితే ప్రస్తుతం దీనికి రెట్టింపు సంఖ్యలో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ లేకుండా పోడు చేస్తున్న రైతులు ఉన్నారు. ఉదాహరణకు ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 50 వేల ఎకరాల్లో 20 వేలకు పైగా రైతులు ఎటువంటి హక్కు పత్రాలు లేకుండా పోడు సాగు చేస్తున్నారు. ఇలాంటి వారందరికీ భూ యాజమాన్య హక్కు పత్రాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సాయం, రైతు బీమా, పంట రుణాలు, ఇతర సబ్సిడీలు అందుకోలేకపోతున్నారు. దీంతో రోజు రోజుకి పోడు భూములకు పట్టాలివ్వాలనే డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. నిత్యం రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు పట్టాలు ఇవ్వాలని వినతులు అందిస్తున్నారు. అంతేకాక దిన దినం అటవీ శాఖకు పోడు రైతులకు మధ్య సంఘర్షణ సాగుతూనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆర్వోఎఫ్‌ఆర్‌లేని రైతులను అడవి నుంచి ఖాళీ చేయించాలని తీర్పు ఇవ్వడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. పోడు సమస్య తీర్చిన వారికే తమ ఓటు అని స్పష్టం చేస్తున్నారు.

ఆదివాసీ లంబాడీ సమస్య
గిరజనుల్లో ఆదివాసీ, లంబాడీ మధ్య విభజన సమస్య నెలకొంది. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ నాయకులు గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, ఉద్యోగ, ఉపాధితోపాటు రాజకీయ రంగాల్లో లంబాడీల కారణంగా తాము నష్టపోతున్నామని ఆదివాసీల వాదన. ఉమ్మడి ఆదిలాబాద్‌లో అధికశాతం ఆదివాసీలు ఉండగా వారిలో పావు శాతం వరకు లంబాడీలు ఉన్నారు. ఈ సమస్య కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఎంపీగా ఆదివాసీ లేదా లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పరస్పరం పోటీలో ఉంటే ఓట్లు రెండుగా చీలిపోతాయి. అలాగే మహారాష్ట్ర నుంచి వలస వచ్చి స్థిరపడిన మాలీ కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది.

సరి‘హద్దు’ సమస్య  
గత 23 ఏళ్లుగా తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) మహారాష్ట్ర  మధ్య భూ సరిహద్దు్ద వివాదాల్లో ఉన్న 12 గ్రామాల్లో మొదటి పరందోళి జీపీ పరిధిలో ముకదంగూడ, కోట, శంకర్‌ లొద్ది, లెండి జాల, పరందోళి తండా, మహారాజ్‌ గూడ. ఇక రెండో గ్రామపంచాయతీ అంతపూర్‌  పరిధిలో బోలాపటార్, ఇంద్రానగర్, ఎస్సాపూర్, లెండిగూడ, గౌరి, నారాయణగూడ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బోలాపటార్‌ను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఈ రెండు గ్రామ పంచాయతీల పరిధిలో 4,000 జనాభా వరకు ఉంటారు. ఓటర్లు 2,600 మంది ఉన్నారు. ఒక్క పరందోళిలోనే రెండు వేల జనాభా ఉన్నారు. ఇక్కడ 80 శాతం (మహర్, మాంగ్‌) ఎస్సీలు కాగా, మిగతా వారు ఎస్టీలు (లంబాడీ), ఆదివాసీలు, బీసీలు. వీరు అటు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. కానీ భూ పట్టా తదితర సమస్యలు తీరడం లేదు.

బెంగాలీకాందిశీ‘కుల’ సమస్య
1976, భారత్‌ – బంగ్లాదేశ్‌ల విభజన సమయంలో రెండు దేశాల బెంగాలీలు తెలంగాణకు కాందిశీకులుగా వచ్చారు. వారికి నేటి సిర్పూర్‌ నియోజక వర్గంలోని కాగజ్‌నగర్, సిర్పూర్‌ టీ, కౌటాల, చింతలమానేపల్లి మండలాలలో కాంది«శీకుల శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ పరిధిలోని 18గ్రామాలలో సుమారు 20వేలకు పైగా బెంగాలీలు ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 10గుంటల ఇంటిస్థలం 5ఎకరాల వ్యవసాయభూమిని మంజూరు చేసింది. కాని వీరికి ఎలాంటి కుల ధ్రువీకరణ పత్రాలు లేక పోవడంతో బెంగాలీ కాందిశీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఎస్సీ కుల ధ్రువీకరణ ఇచ్చి ప్రస్తుతం నిలిపివేశారు. దీంతో విద్య, ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో బెంగాలీలకు కులపత్రాలు ఇస్తామని హామీలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం నాయకులకు పరిపాటిగా మారిందని బాధితులు పేర్కొంటున్నారు.  

రైల్వే సమస్యలు  
ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆసిఫాబాద్‌ రోడ్‌( రెబ్బెన), కాగజ్‌నగర్, సిర్పూర్‌ టీలో ఉన్న రైల్వే స్టేషన్లు అనేక సమస్యలతో కొట్టుమిటాడుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ రోడ్‌ స్టేషన్‌లో ప్రయాణికులు ప్లాట్‌ ఫాం ఇటు నుంచి అటు వైపు వెళ్లే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటి కీ బ్రిడ్జి లేక పోవడంతో పట్టాలపై, స్టేషన్‌లో నిలిపి ఉన్న గూడ్సు రైళ్ల మధ్య ప్రమాదకరంగా దాటుతున్నారు. రెబ్బెన పరిధిలో న ంబాలో, సిర్పూర్‌ పరిధిలో వేంపల్లి లెవల్‌ క్రాసింగ్‌ వద్ద రోడ్డు బ్రిడ్జీలు ప్రయాణికులు రైళ్ల రాకపోకల సందర్భంగా గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తోంది. కాగజ్‌నగర్, సిర్పూర్‌ స్టేషన్‌లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు